Monday, February 24, 2025
HomeTrending Newsఅది మోసపూరిత యాత్ర: జగదీశ్ రెడ్డి

అది మోసపూరిత యాత్ర: జగదీశ్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది జన ఆశీర్వాద యాత్ర కాదని, మోసపూరిత యాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం కడుతున్న పన్నులకంటే తక్కువ నిధులు రాష్ట్రానికి ఇస్తున్నారని, వాటాగా రావాల్సిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా అందడంలేదని, ఈ విషయంలో చర్చకు సిద్ధమేనా అని అయన సవాల్ విసిరారు. తెలంగాణలో జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి వివిధ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేసీయార్ మీద చేసున్న విమర్శలపై జగదీశ్ స్పందించారు.  నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి చెప్పడం అవివేకమన్నారు. మీరు ఇస్తున్నదేమిటి, మేము దుర్వినియోగం చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పథకాలు చేపట్టడం నిధుల దుర్వినియోగమా అని నిలదీశారు.

తెలంగాణ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఐదుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, నల్లదనం వెనక్కు తెస్తామని చెప్పారని, కానీ నల్ల డబ్బు తేవడం అటుంచి ప్రజల చేతుల్లో ఉన్న తెల్ల డబ్బు కూడా లాక్కునారని విమర్శించారు. మోడీ ప్రధాని అయిన మొదటి సంవత్సరం 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలు ఇప్పుడు 105 రూపాయలకు చేరిందన్నారు. రాష్ట్రంలో ఇస్తున్న 2వేల రూపాయల పెన్షన్ బిజెపి రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు లేవని జగదీశ్ రెడ్డి వివరించారు.

స్కిల్ ఇండియా అని చెప్పి బిజెపి కార్యకర్తలకు అబద్ధాలు చెప్పే స్కిల్ నేర్పించారని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలతో పార్టీని నడపాలని చూస్తున్నారని, అబద్ధాలు చెప్పి ప్రజల్లో కెసియార్ పై ఉన్న ప్రేమను చేరిపెస్తామనుకుంటే అది కుదరదని మంత్రి స్పష్టం చేశారు.  కుటుంబ పాలన అంటూ విమర్శించడం తగదని, అయితే తాము కుటుంబాలను వదిలేసి పాలన చేయాలని అనుకోవడం లేదని మోడీపై పరోక్షంగా విమర్శలు చేశారు జగదీశ్ రెడ్డి.

కేంద్రం ఇస్తున్న నిధులు అంటూ మాట్లాడుతున్నారని, ఎక్కడి డబ్బులని, అవేమైనా పాకిస్తాన్ డబ్బులా, గుజరాత్ డబ్బులా అని మంత్రి తీవ్రమైన వ్యాఖలు చేశారు. తెలంగాణ కార్యక్రమాలను నీతి ఆయోగ్, కేంద్ర మంత్రులు కూడా గతంలో మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్