రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సిఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని, నాలుగేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. జన సేనతో పొత్తుపై తానేమీ మాట్లాడలేనని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబేనని, అయితే జనసేన తో పొత్తు ఉంటే బాగుంటుందని తన అభిప్రాయమన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేంత డబ్బు తెలుగుదేశం పార్టీ దగ్గర లేదని, తమ పార్టీకి చెందిన నలుగురినే వైసీపీ వారు కొన్నారని నిమ్మకాయల వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే జగన్ ను వదిలి పారిపోతున్నారని, అలాంటప్పుడు 175 సీట్లు గెలవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.