నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణంపై తెలుగుదేశం చిత్తశుద్దికి టిడ్కో ఇళ్ళు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము కట్టిన ఇళ్ళకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్ళు కాదు ఊళ్ళు కడతామన్న జగన్ ఈ నాలుగేళ్ళలో కట్టింది కేవలం ఐదు ఇళ్ళు మాత్రమేనని విమర్శించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ఆళ్ళగడ్డలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు.
వివేకా హత్య కేసులో అవినాష్ అడ్డంగా దొరికారని, ఏ తప్పూ చేయకపోతే అబ్బాయి ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. ఈ కేసునుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి తన తల్లిని వాడుకోవడం దారుణమని, వివేకా లాగే ఇప్పుడు కూడా తల్లిని చంపేసి ఆ నేరం తనమీద వేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు.
కర్నూలు విమానాశ్రయాన్ని పూర్తి చేసి మొదటి విమానం దింపింది చంద్రబాబు అని, అలాంటిది దానికి జగన్ మళ్ళీ ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, భోగాపురం ఎయిర్ పోర్ట్, భావనపాడు పోర్టు, అదానీ డేటా సెంటర్, నిన్న మచిలీ పట్నం పోర్టులకు కూడా తమ హయంలోనే శంఖుస్థాపన చేస్తే వాటి పనులు మొదలు పెట్టకుండా ఇప్పుడు వాటికి మళ్ళీ శంఖుస్థాపన చేశారని విమర్శించారు.
కాగా, న్యాయవాదులు లోకేష్ ను కలుసుకుని తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నీచ చరిత్ర వైసీపీదేనని, అమరావతి హైకోర్టులో కనీసం కాఫీ కూడా దొరకడంలేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రాగానే కోర్టులకు సొంత భవనాలు నిర్మిస్తామని, జూనియర్ లాయర్లకోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్ధికంగా వెనుకబడిన లాయర్లకు ఇళ్ళస్థలాలు అందిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.