జగన్ ప్రభుత్వం పేరుకే బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్రకులాల వద్దే పెట్టుకున్నారని…. బిసిలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత కోల్పోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. మూడున్నరేళ్లలో బిసి కులాల కోసం ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి బోర్డులో 37మంది సభ్యులు ఉంటే వారిలో ముష్టి వేసినట్లు బిసిలు ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బిసి సెల్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పలు బిసి సంఘాల కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సిఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సకల శాఖ మంత్రి అందరూ ఒకే జిల్లాకు చెందిన వారే ఉన్నారని బాబు వ్యాఖ్యానించారు. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్ లర్ తో పాటు రిజిస్ట్రార్లను కూడా తమకు కావాల్సిన వారినే నియమించుకున్నారని, వాటిలో కూడా బిసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. ఇతర కులాల విసిలను తొలగించి మరీ తమవారిని నియమిచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే మొదలయ్యిందని, బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో తోడ్పడిందని, ఎందరికో రాజకీయంగా ఉన్నత పదవులు కట్టబెట్టిందని బాబు వివరించారు. వెనుకబడిన వర్గాలు ఎన్నోసార్లు పార్టీకి అండగా నిలబడ్డారని, వారి సంక్షేమం కోసం భవిష్యత్తులో ఎలాంటి పపథకాలు అవసరమో ఓ నివేదిక తయారు చేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న పథకాలన్నీ గతంలో తాము మొదలు పెటినవేనని, వాటికి పేర్లు మార్చారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను వెతుక్కుంటూ వచ్చి వారికి పదవులు ఇచ్చే బాధ్యతా తాను తీసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు.
Also Read : బిసిలకు ఏం చేశారు?: యనమల ప్రశ్న