అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించిన ఘనత తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కే దక్కుతుందని, అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బాబాసాహెబ్ ను ఎస్సీ నేతగానే చూడడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిలో అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నిన్న గుడివాడలో పర్యటించిన చంద్రబాబు నేడు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. దళిత నేత బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిటీ వేసి ఆ సిఫార్సులకు అనుగుణంగా దళితులపై వివక్షను అరికట్టామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణకు 22 మొబైల్,23 స్పెషల్ కోర్టులు పెట్టి సత్వరమే శిక్షలు పడేలా చేశామన్నారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో ఆయన స్మృతి వనం 125 అడుగుల ఎత్తుతో స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తోందని, వారికి దక్కాల్సిన నిధులను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. వైసీపీది దళిత వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎమయ్యాయని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఎస్సీలు జగన్ కు ఓటేసి గెలిపిస్తే వారిపైనే దాడులు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. సంక్షేమ పథకాల విషయంలోనూ ఎస్సీలను మోసం చేతున్నారని, ఇంట్లో ఒక్కరికే అమ్మ ఒడి ఇస్తున్నారని అన్నారు. తాము ఎస్సీ సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకు వస్తే వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.