పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని, క్లస్టర్, మండలం, బూత్ స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించేవారికే బాధ్యతలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా టిడిపి ప్రభుత్వమేనని, అందులో ఎటువంటి సందేహం లేదని, ఈ పరిస్థితుల్లో పార్టీకోసం నామమాత్రంగా పనిచేస్తామని అంటే కుదరదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క బోగస్ ఓటు కూడా లేకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లదేనన్నారు. కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జోన్-5 సమీక్షా సమావేశంలోచంద్రబాబు పాల్గొన్నారు.
సిఎం జగన్ వై నాట్ 175 అనిఅంటున్నారని, క్లానీ ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో టిడిపి ఆధిక్యం సంపాదించిందని, ఈ ఫలితాలతో వైయస్సార్ పార్టీలో భూకంపం ప్రారంభమైందని, పులివెందులకు చెందిన రామ్ భూపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సమర్థవంతంగా పోరాడి, కష్టపడి గెలిచాడని ప్రశంసించారు. జగన్ సిఎం అయిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయ్యిందని, బాబాయి హత్య, కోడి కత్తి సంఘటనతో వచ్చిన సానుభూతితోనే ఆయన గెలిచారని అన్నారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టించి ఆనందపడే జగన్‍కు ఇదే చివరి అవకాశమని బాబు పేర్కొన్నారు.
టీడిపీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు వచ్చేలా ఉన్నాయని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడు ముందుంటుందని, కార్యకర్తల కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం కోసం యాప్‍ను ప్రవేశపెట్టామని… అనారోగ్యం వస్తే ఖర్చు పెట్టుకోలేని కార్యకర్తల ఖర్చులు పార్టీ భరించేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
కేసులుపెట్టి మనల్ని నిర్భందిస్తే, పదిమందిని చంపితే దాడులు చేస్తే భయపడతారని వైసిపి నాయకులు అనుకుంటున్నారని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ టిడిపి అని బాబు చెప్పారు. కార్యకర్తలపై దాడులను ఒప్పుకునే ప్రసక్తే లేదని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. టిడిపి స్థాపించి 45 సంవత్సరాలు అయ్యిందని, పార్టీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.