రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, కోర్టు అనుమతితో చేస్తోన్న పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏనాడూ తన శాఖపై దృష్టి పెట్టి సమీక్షలు చేయలేదని, కానీ తన నియోజకవర్గం తణుకులో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని, నల్ల బెలూన్లు ఎగరేశారని విమర్శించారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా 700 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని, దీనిపై మంత్రి శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్వయంగా తనకే నాలుగు లక్షల 11 వేలరూపాయలు ఇంకా రావాల్సి ఉందని, మే 21 న తాను ధాన్యం అమ్మితే ఇంతవరకూ డబ్బులు ఇవ్వలేదని అంటూ ఆర్బీకే సెంటర్ లో ఇచ్చిన రశీదును రామానాయుడు మీడియాకు చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని, డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ ముందు ఈ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని హితవు చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సిఎం జగన్ బాధ్యత వహించాలని, మొన్నటిదాకా శ్రీలంక లాంటి పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పుడు ప్రాంతాలు, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలతో మరో బీహార్ లాగా రాష్ట్రం మారిపోతోందన్న భయం ప్రజల్లో నెలకొని ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన సిఎం అరాచకత్వం వైపు నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిపై జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు కాబట్టి తాము కూడా అదే చేయాలా అని ప్రశ్నించారు. వైఎస్ హయం కంటే బాబు పాలనలోనే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టారని స్వయంగా ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించిన విషయాన్ని రామానాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also Read : అసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు అచ్చెన్న సవాల్