తమ సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తుంటే… జగన్ సభలకు కూలీ ఇచ్చి తీసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కో సభకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. జగన్ ను జె’గన్’ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో మొత్తం 35 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్ధులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజంలో ప్రజాగళం బహిరంగసభలో బాబు ప్రసంగించారు.
శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని జీఎంఆర్ కు అప్పగించానని, అయన తనకు బంధువు ఏమీ కాదని, కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే ఇచ్చామన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని కూడా 2020 నాటికి పూర్తి చేయాలని సంకల్పించామని… కానీ జగన్ అధికారంలోకి వచ్చి దాన్ని నిర్లక్ష్యం చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్ళీ శంఖుస్థాపన చేశారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, భావనపాడు పోర్టులను కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారని, ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంపద సృష్టిస్తే, జగన్ తన వ్యక్తిగత సంపద పెంచుకున్నారని ఆరోపించారు. తమది సంక్షేమ రాజ్యం అయితే జగన్ ది విధ్వంస రాజ్యమని, నాడు ప్రశాంత ఉత్తరాంధ్ర నేడు కబ్జాల ఉత్తరాంధ్రగా మార్చారన్నారు.
జగన్ పై రాయి దాడి జరిగితే రాష్ట్రంపై జరిగినట్లే అని సజ్జల అంటున్నారని, కానీ తమపై రాళ్ళు వేసినప్పుడు మాత్రం హేళన చేశారని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒక చిన్న గులకరాయి విసిరితే డ్రామాలు ఆడుతున్నారని, కనికట్టు విద్యలు చేస్తున్నారని, కరెంటు కూడా నేనే తీసేయించానంటూ చెత్తమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఎవరున్నారని…. ఎవరి పాలనలో మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.