Sunday, September 8, 2024
HomeTrending NewsYuva Galam: బిజెపితో ఉన్నా మైనార్టీలకు న్యాయం చేశాం: లోకేష్

Yuva Galam: బిజెపితో ఉన్నా మైనార్టీలకు న్యాయం చేశాం: లోకేష్

సిఎం జగన్ ది పోలీసు బలం అయితే తనది ప్రజాబలమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు అంగన్ వాడీ టీచర్లకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పడంటూ జగన్ పై ఛలోక్తులు విసిరారు. గత ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చలేదని విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ సిఎం కు, మధ్య ప్రదేశ్ సిఎం కు ఎంతో తేడా ఉందని…. ఆ రాష్టంలో ఓ దుర్మార్గుడు గిరిజన  యువకుడు రావత్ ను అవమానిస్తే ఇంటికి పిలిచి రావత్ కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పారని, కానీ ఈ రాష్ట్రంలో దళితులపై యధేచ్చగా దౌర్జ్యన్యాలు జరుగుతుంటే ఇక్కడి సిఎం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.

ఉదయగిరి గడ్డపై యాత్ర చేయడం తన అదృష్టమని, ఇక్కడి ప్రజలు తనపై చూపిన అభిమానం అపూర్వమైందని భావోద్వేగంతో వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేస్తామని,  ఉదయగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఇక్కడి పసుపు, బత్తాయి రైతులను ఆదుకుంటామన్నారు.

తాడిపత్రిలో దళిత వర్గానికి చెందిన సిఐ ఆనందరావు.. అక్కడి ఎమ్మెల్యే  పెద్దారెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఆత్య హత్యకు పాల్పడ్డారని ఈ విషయాన్ని ఆయన కుమార్తె స్వయంగా చెప్పారని, సిఎం జగన్ కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాము అధికారంలోకి రాగానే ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో బిజెపితో పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసినా మైనార్టీలకు ఎలాంటి నష్టం జరగకుండా చూశామని, అప్పట్లోనే రంజాన్ తోఫా, మసీదులకు రంగులు వేయించడం, హజ్ యాత్రకు రాయితీలు ఇచ్చామని గుర్తు చేశారు. టిడిపి రాగానే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు సిఎంగా ఉండగా 43శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, కానీ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ దాన్ని అమలు చేయకుండా జీపీఎస్ తీసుకు వచ్చారన్నారు. తాము వచ్చాక పోలీసు సోదరులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్