Monday, January 20, 2025
HomeTrending NewsLokesh: వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో ఉంచారు...

Lokesh: వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో ఉంచారు…

ప్రజల కోసం పోరాడుతున్నందుకు, జగన్ ప్రభుత్వ అవినీతిపై నిలదీసినందుకే చంద్రబాబును 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మూడు వేల కోట్ల రూపాయలు అని మొదట్లో చెప్పారని, ఆ తర్వాత 370 కోట్లు అని మాట మార్చారని, నిన్న కోర్టులో 27 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారని లోకేష్ వివరించారు. 14 ఏళ్ళపాటు సిఎంగా, 14 ఏళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం పని చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు.

బాబుపై దొంగ కేసులు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులుగా జైల్లో ఉంచారని, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ అంతిమంగా న్యాయం దక్కక పోదని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. 1992లో కుటుంబం కోసం హెరిటేజ్ సంస్థ పెట్టామని, పదేళ్లుగా తమ ఆస్తులు ప్రకటిస్తున్నామని, సొంత డబ్బులు రాజకీయాల కోసం ఖర్చు చేశాము తప్ప అవినీతికి పాల్పడలేదన్నారు. బాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లను కలిసేందుకు ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.

గతంలో చంద్రబాబు ఒక్క చిటికే వేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అని లోకేష్ ప్రశ్నించారు, తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పారు. ప్రజా సమస్యలపై శాంతియుత పోరాటం కొనసాగించాలని బాబు సూచించారని లోకేష్ వెల్లడించారు. జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం కృష్ణా జలాల్లో ఏపీ హక్కులను తాకట్టు పెడుతున్నారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని బాధ పడ్డారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగిస్తామని, రేపు సాయంత్రం ఏడు గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు లేదా మొబైల్ లైట్ లు ఆన్ చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపు ఇచ్చామని, బాబుతో నేను కార్యక్రమాన్నిప్రతి ఇంటికీ తీసుకు వెళతామని చెప్పారు. జన సేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ ని త్వరలోనే  ప్రకటిస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్