Sunday, November 24, 2024
HomeTrending NewsIrrigation: జగన్ పోవాలి- సీమలో సిరులు పండాలి: చంద్రబాబు

Irrigation: జగన్ పోవాలి- సీమలో సిరులు పండాలి: చంద్రబాబు

రాయలసీమకు సిఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సాగునీటి శాఖ పూర్తిగా పడకేసిందన్నారు.  రాష్ట్రంలో మొత్తం 69 నదులు ఉన్నాయని, వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించవచ్చని.. తద్వారా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.  టిడిపి రాయలసీమ డిక్లరేషన్ పై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నీటిని ఒకవైపు శ్రీకాకుళం జిల్లా వరకు, మరో వైపున  గోదావరి నదిని పెన్నాకు  అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించామని కానీ ఈ ప్రభుత్వం  సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.

తమ ఐదేళ్ళ పాలనలో 68,293 కోట్ల రూపాయలు సాగునీటిరంగంపై ఖర్చు పెట్టామని, కానీ ఈ ప్రభుత్వం  నాలుగేళ్ళలో ఖర్చు పెట్టింది కేవలం 22,165కోట్లు మాత్రమేనని వెల్లడించారు. మొత్తం బడ్జెట్ లో ఇరిగేషన్ వాటా తమ హయంలో  బడ్జెట్ లో 2.35 శాతం మాత్రమే కేటాయించారని, దీని ద్వారా ఈ ప్రాంతానికి వీరు ఏ మేరకు అన్యాయం చేస్తున్నారో అందరూ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను రతనాల సీమగా చేయాలని ఓ చిత్తశుద్దితో పని చేశామని, కానీ తాము ఓడిపోవడంతో లక్ష్యం నెరవేరలేదని చెప్పారు. కేంద్రంతో పోరాడి తెలుగుగంగ  ప్రాజెక్టు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.  ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నేటికి 614 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టలకేపోయారని, 60 మంది సజీవ సమాధి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని తీసుకు వస్తామని మోసం చేశారని ఆరోపించారు.  కమీషన్ల కక్కుర్తి కోసం సాధ్యం కాని ప్రాజెక్టులు 35 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచారని, కానీ ప్రజలకు అవసరమైన 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యం కాని పనులు చేస్తున్నారన్నారు.

ప్రాజెక్టులపై ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు.  అందుకే తాము ‘జగన్ పోవాలి- సీమలో సిరులు పండాలి’ అనే నినాదం ఇస్తున్నామని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఈ స్థాయిలో ద్రోహం చేయలేదని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్