మంచి చేస్తున్న మనుషులను, వ్యవస్థలను అవమానించడం సంస్కారం కాదని పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వాలంటీర్ల వ్యవస్థపై ఇటీవలి కాలంలో పవన్, చంద్రబాబు చేస్తున్న విమర్శలపై జగన్ ఘాటుగా స్పందించారు. సేవాభావంతో పనిచేస్తున్న వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంస్కార హీనంగా ఉన్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
అవినీతికి, వివక్షకు తావు లేకుండా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాలికి బలపం కట్టుకుని అందరికీ అందిస్తున్న వారిపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒకటో తారీఖున తెల్లవారకముందే తలుపు తట్టి వృద్ధులకు పెన్షన్ అందిస్తున్నారంటూ వాలంటీర్లను కొనియాడారు. వీరు బైట వ్యక్తులు కాదని….. మన గ్రామంలో, మన ఇరుగు పొరుగు పిల్లలేలని, అందరికీ తెలిసిన వారేనని ఇలాంటి వారిపై కొందరు మాట్లాడుతున్నారని, ఈ విమర్శలకు స్క్రిప్టు ఎల్లో మీడియా, నిర్మాత చంద్రబాబు అయితే , నటన, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి అంటూ ఫైర్ అయ్యారు. మనుషుల అక్రమ రవాణా చేస్తున్నారని, ఆడ పిల్లలలను ఎత్తుకు పోతున్నారని కొందరు ఆరోపిస్తుంటే సిగ్గులేని మీడియా దానికి ప్రచారం కల్పిస్తోందని నిప్పులు చెరిగారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబు, పదేళ్లుగా ఆయనకు కు వాలంటీర్ గా పనిచేస్తున్న ప్యాకేజ్ స్టార్, ఎల్లో మీడియా వాలంటీర్ల క్యారెక్టర్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. మహిలలంటే ఏమాత్రం గౌరవం లేనివారు, క్యారెక్టర్ లేనివారు వాలంటీర్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరేమిటని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూ ట్యూబ్ లో చూస్తే ఒకరు అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తూ కనబడతారని,
మరొకరు అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టుకోవాలి… లేదా కడుపు చేయాలని అంటారని….
నువ్వు సినిమాల్లోనే చేశావు నేను కాలేజీ రోజుల్లోనే చేశానంటూ ఒక షోలో సిగ్గులేకుండా చెప్పే 75 ఏళ్ళ వ్యక్తి మరొకరని….
కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో సంబంధం పెట్టుకునే వ్యక్తి…. ఇలాంటి వారు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ధ్వజమెత్తారు.
‘బిజెపితో పొత్తు- టిడిపితో కాపురం’; ‘ఇచ్చేది తనపార్టీ బి ఫాం-నిజానికి టిడిపికి బి టీం’ అంటూ పవన్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బిజెపితో స్నేహం, ప్రత్యేక పార్టీ అన్నది మరో డ్రామా అని వ్యాఖ్యానించారు.