చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో ఇటీవలే స్థలాలు కొనుక్కున్నారని వారికి ఒరిజినల్ సర్టిఫికెకేట్లు ఇచ్చారో, జీరాక్స్ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, దత్తపుత్రుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఇటీవలి కాలంలో 9 లక్షల మంది తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారందరికీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ప్రచార సభలో జగన్ ప్రసంగించారు.
ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని, పేదవాళ్లంతా ఒకవైపు.. పెత్తందార్లంతా మరోవైపున ఉన్నారని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం వరకూ అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్లను అడ్డుకుని వారి ఉసురు పోసుకున్నారని.. ఏ ప్రభుత్వాన్నైనా 6౦ నెలలకోసం ఎన్నుకుంటారని… కానీ 57 నెలలకే జగన్ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికే చర్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్క చెల్లెమ్మలకు వివిధ సంక్షేమ పథకాల కింద బటన్లు నొక్కితే ఆ సొమ్మును వారి అకౌంట్లలో పడకుండా… ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు పన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ ఎన్నికలు అయిపోయాక 14వ తేదీన ఇస్తామని చెబుతున్నారని, ఇది కుట్ర కాకపొతే మరేమిటని ప్రశ్నించారు. అయినా తనకు కావాల్సింది అక్కచెల్లెమ్మల, అవ్వాతాతల సంతోషం, అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం…రైత్నన్న ముఖంలో సంతోషం అని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటను నమ్మి… ఐదేళ్లుగా తాము చేస్తున్న మంచిని ఏ ఒక్కరూ పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.