Sunday, January 19, 2025
HomeTrending Newsగేర్ మారుస్తున్నాం: పార్టీ నేతలతో జగన్

గేర్ మారుస్తున్నాం: పార్టీ నేతలతో జగన్

Top Gear:  వచ్చే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధంకావాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో 151  సీట్లు గెలిచామని, దీనికి ఒక్క సీటు కూడా తగ్గకుండా మళ్లీ మనం గెలవాలని, మామూలుగా గెలవటం వేరు, బ్రహ్మాండంగా గెలవడం వేరని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. 175 కి 175 ఎందుకు రాకూడదని ప్రశ్నించారు.  గతంలో కుప్పంలో మనం గెలవలేదని, కాని అక్కడ మున్సిపాల్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే.. ఎందుకు గెలవలేమని, అక్కడ కూడా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది, ఈ భేటీలో జగన్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇక నుంచి క్రమం తప్పకుండా నేతలతో సమావేశం అవుతానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • ప్రాంతీయ సమన్వయ కర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించాం
  • జిల్లాల  ఇన్‌ఛార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశాం
  • ఇవాళ మంత్రులుగా ఉన్నవారందరూ.. జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు.. తమ కన్నా ఎక్కువ అనే భావనను గుర్తుంచుకోవాలి
  • ఎవరికైనా పార్టీ అన్నదే సుప్రీం, ఈ విషయాన్ని అందరూ గమనించాలి
  • రీజినల్‌ కో ఆర్డినేటర్లను, పార్టీ జిల్లాల అధ్యక్షులను గౌరవించాలి
  • మంత్రులంతా వారికి సమాన స్థాయిలో చూసుకోవాలి,  లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది
  • 2 ఏళ్లలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్నవారు.. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కూడా గడపగడపకూ వెళ్ళాలి
  • మంత్రి అయినా కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నారన్న భావన కలగాలి, ప్రతి మంత్రీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి
  • మంత్రులంతా కచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ, రీజినల్‌ కోఆర్డినేటర్లతోనూ పూర్తి అనుసంధానం కావాలి
  • మంత్రులుగా ఉన్నవారు తామే నాలుగు అడుగులు వెనక్కి వేసి, మిగిలిన వారిని కలుపుకుంటూ పోవాలి

  • పైస్థానంలో ఉన్న మంత్రులు.. అందర్నీ అనుసంధానం చేసుకోవాలి, దీనివల్ల వారి పెద్దరికం పెరుగుతుంది
  • మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే మంత్రులంతా కూడా గడప, గడపకూ కార్యక్రమం చేయాలి
  • మంత్రి అయిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ అందుబాటులోకి వచ్చారన్న పాజిటివ్‌ టాక్‌ మీకు ఇంకా ప్లస్‌ అవుతుంది
  • జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలుగా బాధ్యతలు తీసుకుంటున్నవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి
  • పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులగా ఉన్నవారు మంత్రులుగా వస్తారు
  •  రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు, ఇలా ప్రక్షాళన జరుగుతుంది.
  • పార్టీ అన్నది సుప్రీం,  పార్టీపరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి
  • ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొదట్లో చెప్పాను, పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం
  • జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నాం
  • త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి

దీనితో పాటు సచివాలయ వ్యవస్థ, మీడియా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడం, మేనిఫెస్టో అమలు, బూత్ కమిటీలకు శిక్షణ,  పదవుల్లో సామాజిక న్యాయం చేసిన విధానం లాంటి అంశాలపై కూడా పార్టీ నేతలకు సిఎం కూలంకషంగా వివరించి ఈ అన్ని విషయాలనూ ప్రజలకు వివరించాలని కోరారు.

Also Read : జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్ల నియామకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్