Postponed: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు అందించే ఉద్దేశంతో ఈ జగనన్న తోడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రెండో విడతలో సాయం అందుకున్న 6,91,530 మంది తో పాటు కొత్తగా 157760 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి మొత్తం 9.05 లక్షల మందికి ఈ పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. ఈ విషయాన్ని గత వారం సెర్ఫ్ సమీక్ష సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు మూడవ విడత సాయం అందజేసే కార్యక్రామాన్ని మంగళవారం నిర్వహించాల్సి ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించిందని, స్వర్గీయ మంత్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించ తలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సంతాప దినాల దృష్ట్యా జగనన్న తోడు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28 (సోమవారానికి) కి వాయిదా వేసినట్లు వివరించారు.