జగపతిబాబు ఇప్పుడు పవర్ఫుల్ విలనిజానికి కేరాఫ్ అడ్రస్. విలన్ గా టర్న్ తీసుకున్న దగ్గర నుంచి, ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారిన ఆయన, ఆ తరువాత స్టార్ విలన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. విలన్ గా జగపతిబాబును దృష్టిలో పెట్టుకుని మరీ పాత్రలను క్రియేట్ చేసే స్థాయికి ఆయన వచ్చేశారు. ప్రతినాయకుడిగా జగపతిబాబు చేసిన పాత్రలను చూస్తే, అవి ఆయన మాత్రమే చేయగలరని అనిపిస్తుంది.
గ్రామీణ స్థాయిలో ఫ్యాక్షన్ విలనిజం చూపించాలన్నా .. కార్పొరేట్ బిజినెస్ మెన్ గా ఆ రేంజ్ విలనిజాన్ని చూపించాలన్నా అది ఆయనకే చెల్లుతుంది. ‘నాన్నకి ప్రేమతో’ .. ‘రంగస్థలం’ .. ‘అరవింద సమేత’ వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ స్థాయి పవర్ఫుల్ విలనిజాన్ని ఆయన మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘రుద్రంగి’. వచ్చేనెల 7వ తేదీన రానున్న ఈ సినిమాలో ఆయన ‘భీమ్ రావ్’ దొరగా కనిపించనున్నారు.
‘పాపమనేది నేను ఆగిపొమ్మంటే ఆగిపోతుంది .. పుణ్యమనేది నేను నడవమంటే నడుస్తుంది’ అంటూ ఆయన చెప్పిన ఒక్క డైలాగ్ తో ఆయన పాత్ర ఎంత వైలెంట్ గా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన పాత్రకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. తన పాత్ర స్వభావానికి అద్దం పట్టే మేనరిజమ్ కూడా ఉందనే విషయం తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత జగపతిబాబు నుంచి మరో విలక్షణమైన విలన్ పాత్ర వస్తోందని అర్థమవుతోంది. ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.