Friday, November 22, 2024
HomeTrending Newsకాశ్మీర్ లోయలో ఆసక్తికర పోటీ

కాశ్మీర్ లోయలో ఆసక్తికర పోటీ

కాశ్మీర్ లోయలో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్‌సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌ బరిలో దిగుతున్నారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాకు చెందిన ముఫ్తీ తాను పోటీ చేసే స్థానాన్ని ఆదివారం ప్రకటించారు. గతంలోనూ ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన ఆమె తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి మరోసారి బరిలో దిగుతున్నారు.

2022లో కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ స్థాపించిన గులాం నబీ ఆజాద్‌ అనంతనాగ్ లో ప్రధాన పోటీదారుగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆజాద్ కు లోపాయికారిగా బిజెపి మద్దతు ఇస్తోందని లోయలో ప్రచారం జరుగుతోంది. ఆజాద్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఓ వర్గం ప్రచారం చేస్తుండగా… మరోవైపు కాశ్మీర్ ప్రత్యేక నినాదం నీరుగారుతుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

అనంతనాగ్ నుంచి 2019 ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన జస్టిస్‌ హస్‌నైన్‌ మసూది గెలిచారు. ఈ దఫా ఇండియా కూటమి తరఫున నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌ పోటీ పడుతున్నారు. లోయలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కు కొంత పట్టు ఉంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రెండు, ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు. పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఇటీవల వరకు ఇండియా కూటమి భాగస్వామిలో ఉన్నప్పటికీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తన అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు విచ్ఛిన్నమైంది. దీంతో ఇక్కడ ఎవరు జయకేతనం ఎగురవేస్తారనే అంశంలో ఉత్కంట నెలకొంది.

రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతాలైన జమ్మూ – కాశ్మీర్ భూభాగాల్లో పార్టీల ప్రాభల్యం విభిన్నంగా ఉంది. కేంద్రంలో ఎన్.డి.ఏ కూటమి అధికారంలోకి వచ్చాక జమ్ములో బిజెపి పట్టు బిగించింది. వేర్పాటువాదం బలంగా ఉన్నా కాశ్మీర్ లోయలో పిడిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.

ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా బిజెపి గులాం నబీ ఆజాద్ పార్టీకి మద్దతు ఇస్తోందని లోయలో వేర్పాటువాద శక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలు. దేశవ్యాప్తంగా బలపడుతున్న బిజెపి తీరును బేరీజు వేస్తున్న లోయలోని మేధావి వర్గం ఆజాద్ కు మద్దతు ఇవ్వటమే మేలు అని సూచిస్తున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరోవైపు జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్‌సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఈ మేరకు సోమవారం ప్రకటించారు.

-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్