పొత్తుల విషయంలో బిజెపి-జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విభిన్న వైఖరి విమర్శలకు దారి తీస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరిన పవన్ కళ్యాణ్ రెండు నెలలక్రితం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ఎన్డీయే భాగస్వామ్యం పార్టీల నేతల సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ను తన రాజకీయ రణక్షేత్రంగా మలచుకున్న జనసేనాని అక్కడే తన దృష్టి అంతా కేంద్రీకరించారు. అప్పుడప్పుడూ తెలంగాణ రాజకీయాలపై ఏవో కొన్ని వ్యాఖ్యలు, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. తన వారాహి విజయ యాత్రను కూడా ఏపీలోనే నిర్వహిస్తున్నారు.
బిజెపి తనకు ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, అయితే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలబోనీయనని రెండేళ్ళ క్రితమే పవన్ శపథం చేశారు. విశాఖలో పవన్ యాత్రను అడ్డుకున్నారంటూ సంఘీభావం తెలిపేందుకు బాబు హోటల్ కు వెళ్లి మరీ పవన్ ను కలిశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో బాబు ఇంటికెళ్ళి పవన్ ఆతిథ్యం స్వీకరించారు. అప్పటికే భవిష్యత్తు పొత్తులపై ఓ అవగాహనకు బాబు-పవన్ లు వచ్చారు. ఎన్డీయేలో ఉన్న పవన్ బిజెపితో కూడా కలిసి 2014 ఫార్ములా పోటీకి ఢిల్లీ పెద్దలని ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈలోగా చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం మలుపు తిరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న బాబును కలిసి బైటికి రాగానే జనసేన-టిడిపి కలిసి పోటీ చేస్తాయని వీరావేశంగా పవన్ స్వయంగా ప్రకటించారు. బాబుతో పొత్తు విషయంలో తాము ఓ తుది నిర్ణయానికి రాకముందే పవన్ చేసిన ఈ ప్రకటన బిజెపి పెద్దలను నివ్వెర పరిచింది. ఇదే సమయంలో తెలంగాణా ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీనికంటే ముందే తెలంగాణలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని, 33 సీట్లలో పోటీకి సన్నాహాలు చేస్తున్నామంటూ ఓ జాబితాను జనసేన విడుదల చేసింది. కేసిఆర్ పై ఎప్పుడూ ఘాటైన విమర్శలు చేయని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు, అంతిమంగా బిఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే రంగంలోకి దిగుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.
అసలే టిక్కెట్లు, అభ్యర్ధులు, వలసలతో గందరగోళంలో ఉన్న తెలంగాణా బిజెపికి పవన్ వైఖరి షాక్ ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన నేతలు కిషన్ రెడ్డి, డా. లక్ష్మణ్ లు ఆయన ఇంటికెళ్ళి మద్దతు కోరారు, కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. నిన్న ఏకంగా జనసేనానిని వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు కూడా. ఎట్టకేలకు ఓ పది సీట్ల వరకూ జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది.
దీనితో పవన్ రాజకీయ అపరిపక్వత మరోసారి బైటపడింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో అన్నట్లుగా ఉంది అయన వ్యవహారం. ఏపీ బిజెపితో కలిసి ఇటీవలి కాలంలో ఉమ్మడిగా ఎలాంటి కార్యాచరణ చేపట్టని పవన్ తెలంగాణాలో మాత్రం ఆ పార్టీతో కలిసి ఏకంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు, కానీ ఏపీలో మాత్రం దీనికి విరుద్ధంగా టిడిపితో వెళ్తామంటున్నారు.
మరోవైపు ఏపీలో టిడిపితో కలిసే ప్రసక్తే లేదని చెబుతోన్న బిజెపి.. తెలంగాణాలో మాత్రం ఏపీలో టిడిపితో పొత్తులో ఉన్న జనసేనతో కలిసి వెళుతోంది.
జనసేన విధానాల్లో మొదటి నుంచీ ఓ స్పష్టత లేదు. వైసీపీతో కానీ, జగన్ తో గానీ తనకు ఎలాటి శత్రుత్వం లేదని, కేవలం విధానాలతోనే విభేదిస్తున్నామని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకో మొదటి నుంచీ వైఎస్ జగన్ పై వ్యక్తిగత కక్ష, అక్కసుతోనే వ్యవహరిస్తున్నట్లు కనబడుతూ వస్తోంది.
జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా పొత్తుల విషయంలో రాష్ట్రానికో రకంగా వ్యవహరించడం కూడా విచిత్రంగా ఉంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి తెలంగాణాలో పోటీ చేశాయి. సిఎం కేసిఆర్ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో బిజెపి అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మరోసారి కేసిఆర్ కు అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తూ ఉండవచ్చు. తెలంగాణలో అసలు పోటీ చేయాలో వద్దో తేల్చుకోలేని అయోమయంలో టిడిపి ఉంది.
తెలంగాణా ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన-టిడిపి కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్ళే విషయమై బిజెపి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బాబు రాజకీయ ఎత్తుగడలపై సంపూర్ణ అవగాహన ఉన్న మోడీ-షా ద్వయం టిడిపితో కలిసేదుకు ఇష్టపడడం లేదని ఢిల్లీ రాజకీయవర్గాలనుంచి అందుతోన్న సమాచారం.
లోక్ సభతో పాటే ఏపీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఏపీ విషయంలో బిజెపి ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో త్వరలోనే తెలియనుంది.