ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురం పర్యటన సందర్భంగా రోడ్ల మధ్యన, ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, దీనితో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ఎల్లుండి సిఎం జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి మహిళా స్వయం సహాయక సంఘాల కు వడ్డీ లేని రుణాలు అందించే ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సిఎం భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని చెట్లను అధికారులు తొలగిస్తున్నారు, దీనిపై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి.. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః” అంటూ ట్వీట్ చేశారు.
దీనికి సంబంధించి పలు ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.