ఎనభైల తొలినాళ్లలో విప్లవాభిమానులకు జననాట్యమండలి కళాకారిణి ఎన్ ఆర్ స్వర్ణలత చిరపరిచయం. ఇంద్రవెల్లి మారణకాండ తర్వాత గద్దర్ నేతృత్వంలో జననాట్యమండలి రూపొందించిన రగల్ జండా నృత్యరూపకంలో గొండు యువతిగా అభినయించి రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంది. నాటికి తాను సికింద్రాబాద్ కంటోన్మేంట్లోని లాల్బజార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని. వెంకటాపురంలోని నిమ్మ రాజయ్య రత్నమ్మల ఏడుగురు బిడ్డల్లో నాల్గవది స్వర్ణలత. చిన్ననాటి నుంచే ఆటపాటలలో చురుకుగా ఉండే స్వర్ణ హైస్కూల్ నాటికి ఎన్.సి.సి క్యాడెట్గా ఉండేది. కంటోన్మేంట్ ప్రాంతంలో ఊపందుకున్న రాడికల్ యువజనోద్యమ ప్రభావంతోపాటు తన బంధువైన గద్దర్ ప్రభావంతో విప్లవ సాంస్కృతికోద్యమంలో చేరిన అనతికాలంలోనే విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యింది. 1983లో మేడ్చెల్ జూనియర్ కళాశాల విద్యార్థినిగా తరువాత 1984లో మారెడుపల్లి కస్తూర్బా కళాశాల విద్యార్థినిగా ఆర్.ఎస్.యు. పూర్తికాలం కార్యకర్తయ్యింది. విస్తరించిన విప్లవోద్యమం మహారాష్ర్టలో వెళ్లూనుకొంటున్న సంధర్భంగా ఆదివాసి షేత్ మజ్దూర్ సంఘటన్ మహాసభల సంధర్భంగా సిరోంచ ప్రాంతపు ఆదివాసి గ్రామాల్లో చురుకుగా క్యాంపెయిన్లో పాల్గొంది. రాడికల్ యువజన సంఘం రాష్ట్ర మహాసభల సంధర్భంగా నగర విద్యార్థునులతోపాటు మావో బ్యాడ్జ్ అందుకొంది. విప్లవ విద్యార్థి ఉద్యమానికి నూతనోత్తేజం అందించిన అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభల నాటికే తీవ్రనిర్భంధం అమలవుతున్నకాలం. సభలకు అనుమతి నిరాకరించిన నాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామరావు కారును చుట్టుముట్టి ఘోరావ్ చేసిన విద్యార్థునుల బృందంలో మద్దెల స్వర్ణలతతోపాటు చిన్నస్వర్ణ పాల్గొంది. లాఠీచార్జీలో గాయపడి కూడా సభవేదికను చేరుకొని ఎర్రదారిలోనా చెల్లెమ్మా ఎర్రజండాలెత్తరావే చెల్లెమ్మా అంటూ తన బృందంతో పాటపాడి సభికులకు ఉత్తేజాన్నందించింది.
నిర్భందం తీవ్రత పెరిగి బహిరంగ కార్యకలాపాలు బందయిన కాలంలో పార్టీ ఆదేశాలతో నాచారం కార్మికవాడలో కార్మికురాలిగా చేరింది. 1987ఆరంభంలో పార్టీ సాంకేతిక విభాగం దెబ్బతిన్న సందర్భంగా సాంకేతిక రంగంలో సభ్యురాలుగా తన సేవలందించింది.
మహత్తర శ్రీకాకుళ సాయుధ పోరాటం దెబ్బతిన్న తరువాత ఉద్యమ పునః నిర్మాణ కృషిలో భాగంగా అడవిలోకి వెళ్లిన మహేంద్ర దళంలో మలి శ్రీకాకుళ అడవి ఉద్యమంలో తొలి మహిళ సభ్యురాలు వీర గున్నమ్మ స్పూర్తితో గున్నక్కగా ప్రజల్లో కలిసి పోయింది. అనతికాలంలోనే మందస, సోంపేట ప్రజల తలలోనాలికయ్యింది. తర్వాత ఊపందుకున్న రైతంగ ఉద్యమంలో ముందుకొచ్చిన ఆనేక మంది మహిళ కార్యకర్తలకు స్పూర్తిగా నిలిచింది. అనతికాలంలోనే తీవ్రమైన నిర్భంధంలో అనారోగ్య సమస్యలనెదుర్కొంటూనే ప్రజలను అంటిపెట్టుకుని ఉంది. ఉద్యమ విస్తరణలో భాగంగా గజపతి జిల్లాలో దేవగిరి దళంలో డిప్యూటీ కమాండర్గా బాద్యతలు స్వీకరించింది.
ఒరిస్సాలో రైతాంగోద్యమ నిర్మాణానికి పూనుకుంది. ఆరోగ్యం ఎంతగా ఇబ్బంది పెట్టినా కొత్త ప్రాంతంలో ప్రజల భాష నేర్చుకొని తలలోనాలుకయ్యింది. 1995 మధ్య భాగంనాటికి దక్షిణ ఒరిస్సా మొత్తం మీద ప్రభావమేసిన గజపతి జిల్లా రైతాంగ పోరాటాలకు నాయకత్వం అందించింది. సాంస్కృతిక రంగం నుంచి సాయుధ పోరాట రంగం వరకు ఎన్ని కష్టనష్టాలొచ్చినా చలించక నిలిచింది. తర్వాత క్రమంలో కొండబారిడి దళంలో బాధ్యతలు నిర్వహిస్తూ అప్పటివరకు ఆదివాసీ ప్రాంతానికే పరిమితమైన ఉద్యమాన్ని మైదాన ప్రాంతానికి విస్తరించడంలో చురుకైన పాత్ర నిర్వహించింది. ఉద్యమం అనేక మలుపుల్లో ఎన్నో ఇబ్బందులను నిబ్బరంగా ఎదుర్కొంది. 1998 ఆగస్టు 8న శ్రీకాకుళం జిల్లా మహాసభ మీద కోపర్డంగ్ కొండల్లో జరిగిన దాడిలో పోలీసు బలగాలను ప్రతిఘటిస్తూ రిట్రీట్ అవుతున్న క్రమంలో గాయపడి నేలకొరిగింది. 1985 నుండి 1998వరకూ ఎన్ని కష్టాలొచ్చినా ప్రజల పక్షంలో ప్రజల మధ్య నిలిచిన కామ్రేడ్ గున్నక్క (స్వర్ణలత)గా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో గిరిజనుల మన్ననలు అందుకొంది.
Also Read : మద్రాసు నగరంలో యువస్వరాలు