‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదింపుతూ నిన్న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ నేపథ్య సంగీతంపై కూడా అభిమానులు గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ పాత్రలను ఎలా మలిచారు? ఆ పాత్రల మధ్య వైవిధ్యాన్ని ఎలా ఆవిష్కరించారు? అనేది అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది.
ఈ సినిమాకి జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణ అయింది. ఈ సినిమాను ఆమె అంగీకరించిన దగ్గర నుంచి, ఎప్పుడెప్పుడు ఆమెను తెలుగు తెరపై చూద్దామా అనే ఆలోచనతో ప్రేక్షకులు వెయిట్ చేస్తూ వచ్చారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ ఉన్న జాన్వీ, తెలుగు సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంది. అసలు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కష్టంగా మారింది. అలా ఆచి తూచి ఆమె ఒప్పుకున్న సినిమా ఇది. పెద్ద హీరో .. పెద్ద బ్యానర్ .. పెద్ద డైరెక్టర్ కావడంతో అభ్యంతరం చెప్పలేకపోవచ్చు.
‘దేవర’లో ఆమె పాత్రను ఎలా డిజైన్ చేశారా అనే ఆశతో కూడా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు. కానీ ఆమె ఫస్టాఫ్ లో అస్సలు కనిపించదు. సెకండాఫ్ లో వచ్చి కాస్త అల్లరి చేస్తుంది. ఒక పాట తరువాత కనిపించకుండా పోతుంది. ఈ పాత్ర కోసమా ఇంతకాలం ఆమె వెయిట్ చేసింది? అనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ పాత్ర వైపు నుంచి లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ ఆశించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశనే ఎదురైంది. ‘దేవర’కి వసూళ్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చుగానీ, పాత్ర నిడివి పరంగా .. గ్లామర్ పాళ్ల పరంగా జాన్వీ నిరాశనే మిగిల్చిందని చెప్పాలి.