కొత్త సంవత్సరం వేళ.. జపాన్ ను భారీ భూకంపం వణికించింది. జపాన్‌లో ఇవాళ 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇషికావా రాష్ట్రంలో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. భూకంపంతో భూమిలో పగుళ్లు వచ్చాయి. దీంతో జనం భయంతో ఆరుబయటే కూర్చుండిపోయారు. టోయోమా, ఇషికావా, నిగాటా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్‌కు చెందిన షిండో స్కేల్‌పై తీవ్రత 7గా నమోదు అయ్యింది. దీని వల్ల తీవ్ర స్థాయిలో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు, దేశం పశ్చిమ తీరం వైపున వార్నింగ్ జారీ చేశారు.
ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్‌లో తెలిపింది. హొక్కియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్రతీరం వెంట సుమారు మూడు మీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడుతున్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా, రష్యాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు రెండు దేశాలకూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 తర్వాత పశ్చిమ తీరాలకు సునామీ అలలు చేరుకున్నాయి. ఫుకుషిమా ప్లవర్ ప్లాంట్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆపరేటర్ టెప్కో తెలిపింది. ఒకటి, రెండో పవర్ ప్లాంట్లు సజావుగా నడుస్తున్నట్లు ఎక్స్ అకౌంట్‌లో టెప్కో వెల్లడించింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.