Sunday, May 19, 2024

ప్రేమకోసం…

True love requires sacrifice…
తోటరాముడి సాహసానికి మెచ్చి మనసిస్తుంది రాజకుమారి. చూసి చప్పట్లు కొడతాం. దేవకన్యలను ప్రేమించి సాహసంతో పెళ్లి చేసుకున్న జగదేకవీరుడికి జేజేలు పలుకుతాం. అటువంటి సంఘటనలు నిజజీవితంలోనూ సాధ్యమే అనిపిస్తుంది జపాన్ రాకుమారి మకో గురించి వింటే. అన్నిటికంటే మిన్నగా అటువంటి  ప్రేమ పట్ల   గౌరవం కలుగుతుంది.

జపాన్ చక్రవర్తి నరుహితో తమ్ముడి కూతురు మకో. సహాధ్యాయి కీ శాన్ కొమురోను ప్రేమించింది. అతన్నే పెళ్లిచేసుకుంటానంది. జపాన్ రాచరిక కుటుంబాల్లో సామాన్యులను పెళ్లి చేసుకోవాలంటే రాచరిక హోదా వదులుకోవాలి. అందుకు సిద్ధమంది మకో. నిశ్చితార్థం అయ్యాక కొమురో తల్లికి సంబంధించిన సమస్యతో వెనక్కి తగ్గారు. ప్రజలకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. దాంతో కొమురో ఉన్నత చదువుల పేరిట అమెరికా వెళ్ళిపోయాడు. మకో మనోవ్యధకు గురయింది. కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్యే చదువు పూర్తి చేసుకుని స్వదేశం వచ్చాడు కొమురో. అతన్నే చేసుకోవాలని పట్టుదలగా ఉన్న మకో కోరిక నెరవేరింది. జపాన్ రాజభవనంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. రాచరిక హోదాతో పాటు భరణం కూడా వదులుకుని కొమురో చేయి పట్టుకుంది మకో. ఇకపై ఈ దంపతులు న్యూయార్క్ లో ఉంటారు.

‘ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా !’… అంటూ ప్రియుడి కత్తి పోట్లకు బలయిపోయిందో యువతి. ఈ సంఘటనకు వేదిక విశ్వనగరం హైదరాబాద్.

నర్సుగా పనిచేసే అమ్మాయి మెడికల్ రిప్రెజెంటేటివ్ గా పనిచేసే అబ్బాయితో ప్రేమలో పడింది. కులాల విషయంలో ప్రేమ ఎప్పుడూ గుడ్డిదే. అదే పెళ్లి అనేసరికి కళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడా అదే జరిగింది. పెళ్లి చేసుకోమన్న పాపానికి అమ్మాయి ప్రాణం తీసేసి, పారిపోయి దొరికిపోయాడు. మరో సంఘటనలో ప్రేమించలేదని అమ్మాయి గొంతుకోశాడో పోకిరి. ప్రేమించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అమ్మాయిలు. ప్రేమించకపోయినా గొంతులు తెగిపోతున్నాయి.

రాచరికంకన్నా ప్రేమే మిన్న అనుకున్న మకో,  బ్రిటన్ యువరాజు విలియమ్స్ వంటి వారు ఎక్కడ? ప్రేమ కన్నా కులం, ధనం, మూర్ఖత్వం ఎక్కువని ప్రాణాలు తీసే వీరెక్కడ? కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది గానీ ఇదే మన ఆధునిక మహాభారతం!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్