Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిత్య భారసహిత స్థితి

నిత్య భారసహిత స్థితి

Jeff Bezos Space Trip :

Every situation is “ZERO GRAVITY” for Indians

సైన్సు ఆగిపోయిన చోట వేదాంతం ప్రారంభమవుతుంది. వైస్ వర్సా వేదాంతం ఆగిపోయిన చోట సైన్సు ప్రారంభమవుతుంది. ఆమధ్య మీది తెనాలే…మాది తెనాలే అయిన మన తెనాలి అమ్మాయి శిరీష బండ్ల అంతరిక్షం బండిలో రోదసి దాకా వెళ్లొస్తే…రెండు తెలుగు రాష్ట్రాలు రోదసి దాటి వెళ్లి పులకించినట్లు మీడియా వార్తలు వండి వడ్డించింది.

ఇప్పుడు తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడు అయిన బెజోస్ రోదసీలోకి వెళ్లి వచ్చాడు. పది నిముషాల్లో రోదసీలోకి వెళ్లిరావడానికే బెజోస్ బృందానికి నిముషానికి మన కరెన్సీలో 4,100 కోట్ల రూపాయల చొప్పున- మొత్తం 41 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యింది.బెజోస్ కు ఉన్న 15 లక్షల కోట్ల సంపదలో 41 వేల కోట్లు చిన్నదే కావచ్చు. కానీ ఆ 41 వేల కోట్లు అంటే భారత దేశంలో ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సగం. అంటే అయిదారు కోట్ల మంది ఆరు నెలల బడ్జెట్. పది లక్షల ఎకరాలకు నీరందించే మూడు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయంతో సమానం.

భారతదేశమంతా కరోనా రెండు డోసులు ఉచితంగా వేయడానికి 25 వేల కోట్లు చాలు. ఇలా బెజోస్ రోదసి ఖర్చును దేనితో అయినా పోల్చుకోవచ్చు. ఎన్ని కోట్ల మందికి కడుపు నిండా ఎన్ని రోజులపాటు ఆ ఖర్చుతో తిండి పెట్టవచ్చు? ఒంటి మీద నూలుపోగు కరువైన ఎన్ని కోట్ల మందికి ఎన్ని జతల బట్టలు కొనివ్వవచ్చు? డబ్బు లేక ప్రాణాలు పోయే ఎన్ని కోట్ల మంది రోగులకు ఉచితంగా వైద్యం చేయించవచ్చు? చదువు చెప్పవచ్చు? ఇళ్లు కట్టవచ్చు? అంటూ లెక్కలు వేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ… అది గతజల సేతు బంధనం లాంటిది.

డబ్బు డబ్బును ప్రేమిస్తుంది.
డబ్బు విలాసాలను ప్రేమిస్తుంది.
డబ్బు వినోదాలను కోరుకుంటుంది.
డబ్బు అద్భుతాలను కొంటుంది.
డబ్బు ఆశ్చర్యాలకు విలువ కడుతుంది.
డబ్బు ఆకాశానికి నిచ్చెన వేస్తుంది.
డబ్బు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది.
కలియుగంలో దేవుడి దర్శనం కూడా డబ్బున్నవారికే ముందు.
డబ్బు మనిషిని నిలువనీయదు.
డబ్బులేని వాడు నేలమీద కాళ్ళీడుస్తూ తిరగాలి. డబ్బున్నవాడు స్పేస్ క్రాఫ్ట్స్ చేయించుకుని చందమామను తాకి ఒక కప్పు వెనీలా ఐస్ ఇచ్చి రావాలి. సూర్యుడిని కలిసి ఒక కప్పు వేడి వేడి టీ ఇచ్చి రావాలి.

గాల్లో తేలినట్లుండే భార రహిత స్థితి అనుభవం పొందడానికి ఎంత ఖర్చయినా పరవాలేదు. యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి పది నిముషాలు భార రహిత స్థితిలో ఉంటే తెలుస్తుంది అందులో మజా. అయితే ఆ భార రహిత స్థితిలో కలిగే అలౌకిక, అమేయ, అతులిత, అమితానందం కోసం సామాన్యులమయిన మనం యాభై వేల రూపాయలయినా ఖర్చు పెట్టే స్థితిలో లేమని బాధ పడాల్సిన పనిలేదు.

నిజానికి – మనమున్నది, ఉండినది, ఉండబోయేది భార రహిత స్థితే. ఈతి బాధల అమిత గురుత్వాకర్షణ శక్తి వల్ల మన భార రహిత స్థితి మనకు తెలియదు.

సంధ్యాసతి చీకటి చీర కొంగు కప్పుకునే ఒకానొక వేళ భాయీయో! ఔర్ బెహనో! అనగానే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేసి హామీ ఇచ్చిన నోట్లు చెల్లకుండా పొతే దేశంలో కోట్లమంది పొందినది భార రహిత స్థితే.

అయిదేళ్లకొకసారి రంగుల కలలకు ఓట్లను అప్పగించి వచ్చి ఓటర్లు మళ్లీ అయిదేళ్ల ఎన్నికల దాకా నిరీక్షిస్తూ పొందుతున్నది భార రహిత స్థితే.

డిగ్రీ కాగానే ఎం ఎస్ లకు పిల్లలకోసం అప్పులు చేస్తూ, వారికి అక్కడే ఆకుపచ్చ కార్డు రావాలని, ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలని ఇక్కడ చిలుకూరులో నూట పదకొండు ప్రదక్షిణలు చేస్తూ సగటు తల్లిదండ్రులు పొందుతున్నది భార రహిత స్థితే.

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రెండు వేల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తే…ఇరవై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడితే… ఉద్యోగాలు రాని పంతొమ్మిది లక్షలా తొంభై ఎనిమిది వేల మంది పొందుతున్నది భార రహిత స్థితే.

గంట గంటకూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నా దారుల్లో ఆగక తిరిగే వాహనాలు, వాహనదారులు పొందుతున్నది భార రహిత స్థితే.

నిరుపేదలు పైసా పైసా కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ బ్యాంకులను బడాబాబులు నిలువునా ముంచి తురుపు తిరిగి విమానమెక్కి లండన్లో చలి కాచుకుంటుంటే బాధ్యతగల డిపాజిటర్లు అనుభవిస్తున్నది భార రహిత స్థితే.

చట్టాలు కలవారి చుట్టాలై వారికి ఊడిగం చేస్తుంటే నిర్బలులు పొందుతున్నది భార రహిత స్థితే.

కరోనా ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న వేళ వ్యాక్సిన్ కంపెనీలు ప్రభుత్వాలను శాసిస్తుంటే ప్రభుత్వం పొందుతున్నది కూడా భార రహిత స్థితే.

సామాన్యులకు అడుగడుగునా భార రహిత స్థితే. బెజోస్ కు ఆ స్థితికి 41 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. సామాన్యుల ఆ స్థితికి అణా పైసా కూడా ఖర్చు ఉండదు.

నేల విడిచి సాము చేయలేని సామాన్యుల నిత్యజీవన పోరాటంలో భార స్థితి…ఈ భార రహిత స్థితులకు ఎప్పటికీ అర్థం కాదు.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

Read More: సినిమా సంతానం

Read More: ఆడీకి ఆటో లేఖ

RELATED ARTICLES

Most Popular

న్యూస్