వనపర్తిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన లే అవుట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, జోనల్ కమిషనర్ శంకరయ్య సమావేశమై చర్చించారు.ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించనున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పీజీ కాలేజీలో తరగతులు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ పరిపాలనా భవనంగా వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ కొనసాగనుంది. ఇంజినీరింగ్ సీట్లు 300, బీ ఫార్మసీ సీట్లు 60 అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నిర్వహించబోయే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో వనపర్తి ఇంజినీరింగ్ కాలేజీని పొందుపరచనున్నారు. సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానిక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.