త్వరలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ లు ముఖాముఖీ సమావేశం కానున్నారు. తైవాన్ వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శాంతి స్థాపనకు రెండు దేశాల అధినేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఎప్పుడు సమావేశం కావాలనేది ఖరారు కావాల్సి ఉంది. ఈ మేరకు శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది.

రెండు దేశాల మధ్య నిన్న జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన విమర్శలకు దారితీస్తోంది. చైనా అంతర్జాతీయ నిబధనలు, విలువలు పాటించాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ల మధ్య గురువారం ఫోన్‌లో సుదీర్ఘంగా వాడీవేడిగా సంభాషణలు సాగాయి. రెండు దేశాల అధ్యక్షుల మధ్య గురువారం జరిగిన ఐదో విడత చర్చలు ఉదయం 8.33 నుంచి 10.50 గంటల వరకు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది. ఈ చర్చల్లో తైవాన్‌ అంశమే ప్రధానంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణతకు అమెరికానే కారణమంటూ ఎప్పటి మాదిరిగానే చైనా నిందించింది. తైవాన్‌ ఎప్పటికైనా తమదేనంటూ చర్చల సందర్భంగా జిన్‌పింగ్‌ గట్టిగా చెప్పారని చైనా పేర్కొంది. ‘‘నిప్పుతో ఆడుకునే వారు దానివల్లే నాశనమవుతారు. ఈ విషయం అమెరికా తెలుసుకోవాలి‘ అంటూ బైడెన్‌ వద్ద జిన్‌పింగ్‌ ప్రస్తావించినట్లు.. చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు వచ్చే నెలలో అమెరికా విదేశాంగ కార్యదర్శి నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించనున్నారు. తైవాన్ సరిహద్దుల్లో ఇటీవల చైనా కవ్వింపు చర్యలు పెరిగాయని, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తూ చైనా పీపుల్స్ ఆర్మీ.. తైవాన్ గగనతలంలోకి పలుమార్లు రావటంపై జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించటం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు – చైనా అధ్యక్షుడితో ముఖముఖి చర్చలకు ఉపక్రమించటం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *