ఇండియాతో జరగనున్న ఆఖరి, ఐదవ టెస్టులో జోస్ బట్లర్ ఆడనున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రకటించాడు. బట్లర్ తో పాటు జాక్ లీచ్ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే లీచ్ ను ఆడించేదీ లేనిదీ మ్యాచ్ మొదలయ్యేరోజు పిచ్ పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని వెల్లడించాడు.
ఇంతవరకూ పిచ్ ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, అయితే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నానని మొదటి స్పిన్నర్ గా మొయిన్ అలీ కొనసాగుతాడని, రెండో స్పిన్నర్ కూడా అవసరమైన పక్షంలో లీచ్ ను తుది జట్టులోకి తీసుకుంటామని రూట్ వివరించాడు.
ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇండియా 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలో ఉంది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండు, నాలుగు టెస్టుల్లో ఇండియా విజయం సాధించగా మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐదో టెస్ట్ ఈనెల 10వ తేదీ శుక్రవారం నుంచి ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరగనుంది. కుమార్తె జన్మించడంతో జోస్ బట్లర్ ఓవల్ లో జరిగిన నాలుగో టెస్ట్ కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ లో రాణించినప్పటికీ బ్యాటింగ్ లో సత్తా చాటలేకపోయింది. ఇండియాకు కేవలం 100 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే అందించగలిగింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇండియా మంచి స్కోరు చేసి ఇంగ్లాండ్ కు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ విఫలమై మ్యాచ్ చేజార్చుకుంది. దీనితో బట్లర్ సేవలు ఆఖరి టెస్టులో వినియోగించుకోవాలని ఇంగ్లాండ్ నిర్ణయించింది. బట్లర్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు.