టిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు భారతీయ జనతా పార్టీలో చేరడంలేదని తేలిపోయింది. బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, జిల్లాలో నెలకొన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలోనే పొంగులేటి బిజెపిలో చేరేందుకు సుముఖంగా లేరని, జూపల్లి సైతం అదే ఆలోచనలో ఉన్నారని.. వారు తమ పార్టీలోకి రావడం కష్టమని వ్యాఖ్యానించారు. మీడియాతో ఈటెల చిట్ చాట్ చేస్తూ ఈ విషయం తెలియజేశారు. పొంగులేటి, జూపల్లి తనకే ఎదురు కౌన్సిలింగ్ ఇస్తున్నారని, కర్ణాటక ఎన్నికల తర్వాత వారి ఆలోచన పూర్తిగా తమకు ప్రతికూలంగానే ఉందని వెల్లడించారు.
ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న సమాచారంతో ఖమ్మం వెళ్లి మరీ వారితో భేటీ అయ్యానని చెప్పారు. ఇప్పటివరకూ వారు కాంగ్రెస్ లో చేరకుండా తాను ఆపగాలిగానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని నిర్వేదం వ్యక్తం చేశారు.