ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులనూ ప్రభుత్వం నియమించనుంది. సభ్యుల పేర్లను రెండ్రోజుల్లో వెల్లడిస్తారు. జిల్లా స్థాయిలోనూ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
గత ఏడాది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా (ఎస్‌ఈసీ)గా నాటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో అయన మూడు నెలలలోపే తన పదవి కోల్పోవాల్సి వచ్చింది.
పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో కూడా జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి అని నిబంధనలు ఉన్నాయి. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్‌తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి కలిపి మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు.
అథారిటీ చైర్మన్ గా కనగరాజ్ అతి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.