Saturday, November 23, 2024

రాజకీయ విద్య

Students- Politics:
భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వార్తలు తెలుగు మీడియాలో ప్రముఖంగా వస్తున్నట్లు…మిగతా భారతీయ భాషల మీడియాల్లో కూడా వస్తున్నాయో లేదో తెలియదు. ఇదివరకటి ప్రధాన న్యాయమూర్తుల సొంత రాష్ట్రాల మీడియా ఇలానే ప్రాధాన్యమిచ్చిందా లేదా అన్నది కూడా మీడియా నిపుణులు చెప్పాల్సిన విషయం. అనేక సామాజిక విషయాల మీద రోజూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్ వి రమణ అభిప్రాయాలు తెలుసుకోగలుగుతున్నందుకు పాఠకులుగా మనం సంతోషించాలి.

ఈరోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒక విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థి ఉద్యమాలనుండి ఎదిగి వచ్చిన ఒక్క రాజకీయ నాయకుడయినా ఈ కొత్త తరంలో ఉన్నారా? అన్నది ఆయన ప్రశ్న. ఈ ప్రశ్న వేసింది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. మూడు, నాలుగు దశాబ్దాలుగా సామాజిక అంశాలను పరిశీలిస్తున్న వ్యక్తిగా ఆయన ప్రశ్నకు…ఆయనే సమాధానం కూడా చెప్పారు. మార్కులు, ర్యాంకుల చదువులు, కార్పొరేట్ ఉద్యోగాల కలల కొలువుల్లో పడి యువత సామాజిక రంగాన్ని పూర్తిగా వదిలేసిందని ఆయనే నిట్టూర్చారు. చివరికి న్యాయ విద్యార్థులు కూడా ఇలానే ఉన్నారని బాధపడ్డారు. జైలు గదుల్లాంటి కార్పొరేట్ ఇరుకు తరగతుల్లో తమ పిల్లలను చదివించడానికి తహతహలాడే తల్లిదండ్రుల మీద జాలిపడ్డారు.

నిజమే.

ఈ విషయం మీద చాలా చర్చ జరగాలి. మార్పు రావాలి.

కానీ- చర్చ చర్చకే పరిమితమవుతుంది.

మార్పు వస్తే మంచిదే కానీ…రాదు. మార్పు రాకపోవడానికి మనమే కారణం.

అర్ధ శతాబ్దపు మన చదువుల అజ్ఞానపు అవగాహనలో డాక్టర్, ఇంజనీరింగ్ తప్ప మిగతా చదువులు విలువ లేనివి అయ్యాయి. ఇప్పుడు ఏమి చదివినా సాఫ్ట్ వేర్ గంగలో మునిగి పునీతులు కావాల్సిందే. ఊళ్లో పదెకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న బడి పనికిరాదు. ఊరవతల పశువుల కొట్టంలో, ఊళ్లో ఊపిరాడని ఒంటి స్తంభపు అపార్ట్ మెంట్లో ట్వింకిల్ ట్వింకిల్ చదువులు చదువుతుంటే చదువుల తల్లి సరస్వతే అసూయపడాలి. ఆరో క్లాసు నుండే ఐ ఐ టి పరీక్షకు కోచింగ్ మొదలు పెడితే ఆ తల్లిదండ్రుల దూరదృష్టికి ఆ ఊరు సిగ్గుతో తలదించుకోవాలి. డిగ్రీ మొదటి ఏడే అమెరికా డాలర్ కలల కొలువులకు తగ్గ జి ఆర్ ఈ, టోఫెళ్లు రాస్తుంటే బృహస్పతి భయపడాలి. పిల్లలు విదేశాల్లో ఎం ఎస్ చేసి అక్కడే స్థిరపడి ఇల్లుకట్టుకుని వీడియో కాల్లో మాట్లాడుతుంటే ఇక్కడ మనం డిజిటల్ ఆనందబాష్పాలు రాల్చాలి.

తెల్లవారుజామున నాలుగుగంటలకు లేచి రెండు కోచింగ్ సెంటర్లకు వెళ్లి, ఆపై కాలేజీకి వెళ్లి, సాయంత్రం మరో కోచింగుకు వెళ్లడమే ఇప్పుడు విద్యార్థి ఉద్యమం.

ఆన్ లైన్, ఆఫ్ లైన్, డైలీ, వీక్లి పరీక్షలు రాయడమే ఇప్పుడు విద్యార్థికి ఆట.

ఒకటి ఒకటి ఒకటి అని రెండుకాని నారాయణమంత్ర అద్వైత చైతన్యం పొందడమే ఇప్పుడు విద్యార్థి తపస్సు.

వేళకు తిండి లేకపోయినా…శరీరం కదలకపోయినా…రాత్రి పగలు మార్కులకోసం చదువుతూ ఉండడమే ఇప్పుడు విద్యార్థి దినచర్య.

మాతృభాషలో చదువు మహా పాపం. మాతృభూమిలో కొలువు మహా ఘోరం. మాతృభూమి సేవ ప్రతీకాత్మకం.

అయినా…అత్యాశ కాకపొతే…చదువు రాజకీయాలకు మైనస్. ఎంత చదివితే రాజకీయాల్లో అంత డిస్అడ్వాంటేజ్. రాజకీయమే ఒక చదువు. అది కాలేజీ తరగతి గదుల్లో నేర్చుకునేది కాదు. చెబితే బాగోదు కానీ…దానికి వేరే చోట్లు ఉన్నాయి.

సమాజంతో విద్యార్థి బంధం తెగిపోవడానికి ఇంకా అనేకానేక కారణాలున్నాయి. అవన్నీ ఇక్కడ అనవసరం. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. మార్కెట్లో లక్షలు, కోట్లు సంపాదించే చదువులే ఒక ఆదర్శమైనప్పుడు...ఆ ఆదర్శమే ఎవరికయినా శిరోధార్యమవుతుంది. ఇందులో మంచి- చెడు చర్చకు మాత్రమే పనికి వస్తుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : ఉద్యోగమో రామచంద్రా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్