సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ ఫాలీ నారీమన్ ఈ రోజు పదవీ విరమణ పొందారు. గోప్యత ప్రాథమిక హక్కు, గే సెక్స్, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కీలకమైన తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. సీజేఐ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టు రెండో సీనియర్ న్యాయమూర్తి కూడా ఆయనే. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ నారీమన్‌ను ఓ సింహంతో పోల్చారు. వీడ్కోలు సభలో ఒకింత భావోద్వేగానికి గురై మాట్లాడారు.
‘‘జస్టిస్ నారీమన్ రిటైర్మెంట్‌తో న్యాయవ్యవస్థను రక్షిస్తున్న ఓ సింహం వీడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ మూల స్తంభాల్లో ఒకరాయన. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన గొప్ప వ్యక్తి’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ నారీమన్‌ను కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నారీమన్ 13,565 కేసుల్లో తీర్పు వెలువరించారని, వీటిలో ఎన్నో కీలక తీర్పులు ఉన్నాయని చెప్పారు. ఆయన రిటైర్మెంట్‌తో న్యాయవ్యవస్థ ఓ విజ్ఞాన భాండాగారాన్ని కోల్పోతోందన్నారు. 35 ఏళ్ల పాటు న్యాయవాదిగా సేవలందించారని గుర్తుచేశారు.
జస్టిస్ నారీమన్ గురించి క్లుప్తంగా..
జస్టిస్ నారీమన్ 1956 ఆగస్టు 13న జన్మించారు. దిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హార్వర్డ్ లా స్కూల్‌లో ఎల్‌ఎల్.ఎం పూర్తిచేశారు. 1979లో బార్ అసోసియేషన్‌లో చేరిన ఆయన 1993లో సీనియర్ లాయర్ అయ్యారు. 2011 జులై 27న సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2014 జులై 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 13,500 కేసుల్లో తీర్పు వెలువరించారు.