Lack of Seriousness: తెలుగులో సీరియస్ కామెడీ కరువయిన ప్రతిసారీ ఒకరు ఉద్భవిస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా కామెడీ సీన్లు అక్కడక్కడా ఉంటుంటాయి. మొత్తం కామెడీ ఉండాలంటే చాలా కష్టం. అది కామెడీ మీద సాము అవుతుంది.
తెలుగు నేల మీద-
హాస్యపు చినుకులు లేక నెర్రెలు చీలినవేళ…
హాస్యపు సన్నివేషాల్లేక గుండెలు బండబారిన వేళ…
హాస్య ప్రహేళికలు, ప్రహసనాలు, నాటకాలు లేక బరువుగా ఉన్నవేళ…
ఎడారిలో ఒయాసిస్సులా…అడుగడుగునా, అణువణువునా హాస్యం పంచడానికి వచ్చినవాడు శాంతి దూత కె ఏ పాల్. కోపాల్…తాపాల్…పాపాల్…అన్నిటికి విరుగుడు ఈ పాల్ . ఈ లోకానికి నిజంగా ఆయన హాస్య దూత. తన హాస్యంతో ప్రజాశాంతిని స్థాపించే నవోదయం, మహోదయం వైపు ఆయన సాగిపోతూనే ఉంటారు.
ఆయన మాటే ఒక ప్రభంజనం.
ఆయన అడుగే ఒక పిడుగు.
ఆయన పిలుపే ఒక మలుపు.
ఆయన ఆలోచనే ఒక విప్లవం.
ఆయన కారు చీకట్లో ఒక కాంతి రేఖ.
మన గొప్పను కథలు కథలుగా ఇతరులు చెప్పనప్పుడు…మనమే చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడంలో మొహమాటపడకూడదు. కే ఏ పాల్ కు అలాంటి మొహమాటాల్లేకపోవడం మన అదృష్టం.
“150 దేశాలను గడగడలాడించి వచ్చా…కే సి ఆర్, కే టి ఆర్ ఒక లెక్కా?”
“జాతీయ పార్టీ పెట్టాలని పి కె కు సలహా ఇచ్చింది కే సి ఆరే. ఆ విషయం స్వయంగా పి కే నాకు చెప్పారు.”
“తెలంగాణాలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తా. అలా చేయకపోతే నా పాస్ పోర్టును సీజ్ చేసుకోవచ్చు.”
కే ఏ పాల్ వాక్రుచ్చిన ఆణిముత్యాల్లో ఇవి కొన్నే.
శాస్త్ర ప్రకారం నాటకం పది రకాలు.
1. నాటకం:-
ఇందులో ఇతివృత్తం ధీరోదాత్తమై ఉంటుంది. భూమి మీద ఏ అగ్ర నాయకుడితో అయినా ముఖా ముఖి తలపడగలిగిన కే ఏ పాల్ కంటే ధీరోదాత్తుడు ఇంకొకరు ఉండడానికి వీల్లేదు.
2. ప్రకరణం:-
ఇందులో కథ కల్పితమై ఉంటుంది. కల్పనలో కే ఏ పాల్ కథల తరువాతే రాజమౌళి తండ్రి కథలయినా.
3. భాణం:-
ఇందులో నాయకుడు ధూర్తుడు. ఇంకొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అవి ఇక్కడ అనవసరం.
4. ప్రహసనం:-
ప్రహసనం మాట వాడుకలో ఉన్నా చాలామందికి అదెక్కడినుండి వచ్చిందో తెలియదు. హాస్యరస ప్రధానమయిన కల్పిత నాటకానికి ప్రహసనం అని పేరు. కాసేపు నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరానిది ప్రహసనం.
5. డిమం:-
ఇందులో నాయకుడు ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కు టమార, గజకర్ణ, గోకర్ణ మయా విద్యలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరింపజేస్తూ ఉంటాడు.
6. వ్యాయోగం:-
గతంలో జరిగిన ఒక మహా యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ అల్లిన కథ.
7. సమవాకారం:-
ఇది కూడా కల్పిత కథే. దేవతలు- రాక్షసులు కలిసిన పాత్రలు ఉండాలి. అమృత మథనం లాంటి ఇతివృత్తాలు.
8. వీధి:-
అప్పటికే బాగా ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా ఒకే ఒక అంకంతో తయారయిన నాటకం.
9. అంకం:-
ఇందులో నాయకుడు నాగరికత తెలియనివాడు.
10. ఈహామృగం:-
ఇందులో మనిషి నాయకుడు. మనవాతీతుడు విలన్. ఏదో ఒకదానికోసం ఇద్దరి మధ్య జరిగే పోరాటమే కథ.
“శాస్త్రమెప్పుడూ నిష్కర్షగా, కర్కషంగానే చెబుతుంది. మనమందులో సారాన్నే గ్రహించాలి…”
అన్నది మాయాబజార్లో పింగళివారి హితవచనం. అయితే కే ఏ పాల్ విషయంలో మనకా శాస్త్ర- సార సంగ్రహణ కన్ఫ్యూషన్ అక్కర్లేదు. నాటక శాస్త్రం ఏమి చెప్పిందో? ఎలా నిర్వచించిందో? ఆ పది రకాల నాటకాలకు ఆయన పరిపూర్ణ ఉదాహరణగా మన కళ్లముందు ఉన్నారు.
హీ ఈజ్ ఏ లివింగ్ లెజెండ్ ఫర్ డ్రామా గ్రామర్.
వుయ్ ఆర్ బ్లెస్సెడ్ విత్ హిజ్ ప్రహసనమ్స్!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :