చంద్రబాబు ఇకనైనా రైతుల గురించి మాట్లాడడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఆయన వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడుతూ నోరు ఇంకా కంపు చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. ఆయన హయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే, మా ప్రభుత్వం వచ్చాక అందించామని, పరిహారాన్ని రూ. 7 లక్షలకు పెంచామని అన్నారు. రైతులకు తాము ఏమి చేశామో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయానికి బాబు చేసిందేమీ లేదు కాబట్టి ఆయనకు శ్వేతపత్రం ఇవ్వడానికి ఏమీ లేదన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో భూగర్భ జలాలు కూడా పెరిగాయని తేలిందని, తాము రైతులను ఆదుకోవడం లేదంటూ బాబు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, ఆయన వ్యాఖ్యలు జోకర్‌ను తలపిస్తున్నాయని మండిపడ్డారు. తాను వ్యవసాయానికి పెద్దపీట వేశానని, మళ్లీ అధికారంలోకి వస్తే, రైతులకు అన్నదాత కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఆయన చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ఈ నాలుగేళ్లలో ఎప్పుడు చూసినా వర్షాలు సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యాయి తప్ప, తక్కువ కురవలేదని, అందుకే ఒక్క కరువు మండలం కూడా ఇప్పటి వరకు ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300కు పైగా కరువు మండలాలు ప్రకటించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం బాగా లేవని చెబుతున్నారని, కానే వ్యవసాయ గణాంకాలు ఏం చెబుతున్నాయో చోదాలన్నారు. ఏటా సగటున 12 లక్షల టన్నుల నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద ఇప్పటి వరకు దాదాపు రూ. 7700 కోట్లు ఖర్చు చేశామని, ఇటీవల టమోటాల సరఫరా కోసం రూ. 10 కోట్లు ఖర్చు పెట్టమని వివరించారు. వినియోగదారులపై భారం పడొద్దని, మరోవైపు రైతులకు న్యాయం జరగాలని తాము ముందడుగు వేశామన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూతబడిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే చంద్రబాబు అన్నం ఎలా తింటున్నాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో యూనివర్సల్ కవరేజ్ లేదు కాబట్టి, దాన్ని వదిలిపెట్టి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కట్టిందని.. దేశంలో ఇలా చేసింది కేవలం మన ప్రభుత్వం మాత్రమేనని. ఈ తర్వాత కేంద్రం యూనివర్సల్ కవరేజ్‌కు ఒప్పుకోవడంతో, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో ఏపీ చేరిందని మంత్రి కాకాణి వెల్లడించారు.