ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. జూన్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చి చేరింది. ఈ రోజు నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోను .. అమెజాన్ ప్రైమ్ లోను అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో హిందీలోను .. అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
‘మహాభారతం’లోని అశ్వద్ధామ .. అర్జునుడు .. కర్ణుడు వంటి పాత్రలను కలుపుకుంటూ, నాగ్ అశ్విన్ అల్లుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. వందల కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూసింది. అలాంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది.
హిమాలయాల ప్రాంతంలోని ‘శంభలా’ అనే గ్రామంలో ‘కల్కి’ భగవానుడు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. యుగాంతంలో ఆ స్వామి దుష్ట సంహారం చేస్తూ వెళతాడు. అయితే ‘కల్కి’ అవతరణను అడ్డుకోవడానికి ఒక ప్రతినాయకుడు చేసే ప్రయత్నంగా ‘కల్కి’ మొదటి భాగం నడుస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఈ సినిమాను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టారు. కథాకథనాల పరంగా కొన్ని విమర్శలు వినిపించినప్పటికీ, ప్రభాస్ కి గల క్రేజ్ లో అవి కొట్టుకుపోయాయనే చెప్పాలి.