ఇంజనీరింగ్ కాలేజ్ లలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అబ్బాయిలు .. అమ్మాయిలు చేరుతుంటారు. కాలేజ్ కి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూ ఉంటారు. అప్పటివరకూ పేరెంట్స్ సలహాలను .. సూచనలను తలనొప్పిగా భరిస్తూ వచ్చిన పిల్లలకు కొత్త రెక్కలు మొలిచినట్టుగా అనిపిస్తుంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా స్వేచ్ఛా గానమే వినిపిస్తూ ఉంటుంది. సిలబస్ సంగతి అలా ఉంచితే, కొత్త పరిచయాలు .. స్నేహాలు .. ప్రేమలు మరుసటి రోజు నుంచే మొదలైపోతాయి.
ఇలాంటి ఒక కంటెంట్ తో ఇంతకుముందు సినిమాలు వచ్చినప్పటికీ, తన మార్క్ తో అదే తరహా కంటెంట్ ను ‘MAD’ టైటిల్ తో దర్శకుడు కల్యాణ్ శంకర్ నిన్న ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చాడు. కాలేజ్ స్టూడెంట్స్ గా చాలామంది కనిపించినా ఒక అరడజను ప్రధానమైన పాత్రలతో ఈ కథను క్యాంపస్ లో పరిగెత్తించాడు. గొడవలు .. కొట్లాటలను కలుపుకుంటూ, ప్రేమ జంటలను పోషిస్తూ .. ప్రోత్సహిస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. మధ్యలో పాటలు మామూలే .. ఇక్కడ భీమ్స్ ను మెచ్చుకోవలసిందే.
ఇక ఇంజనీరింగ్ కాలేజ్ లో అడుగుపెట్టిన స్టూడెంట్స్ తన జోడీలను వెతుక్కునే పనిలో పడతారు. ఈ నాలుగేళ్ల సమయంలో తాము సాధించవలసిందీ .. తమ పేరెంట్స్ ఇక్కడికి పంపించింది కూడా అందుకే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. చేతిలో బుక్స్ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తే, సిగరెట్ .. మందు బాటిల్ మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఇదే విషయాన్ని కాస్త కామెడీ టచ్ తో దర్శకుడు చూపించాడు. పేరెంట్స్ వైపు నుంచి కూడా కాస్త కామెడీ డోస్ ఇప్పించాడు. కథ నేపథ్యం .. ఇప్పుడున్న ట్రెండ్ కారణంగా యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.