Tuesday, February 27, 2024
HomeTrending NewsHamas: హమాస్ ఉగ్రవాదుల బరితెగింపు...ఇజ్రాయల్ ప్రతి దాడులు

Hamas: హమాస్ ఉగ్రవాదుల బరితెగింపు…ఇజ్రాయల్ ప్రతి దాడులు

ఇజ్రాయల్ – పాలస్తీనాల పరస్పర దాడులు మళ్ళీ మొదలయ్యాయి. పాలస్తీనాకు చెందినా హమాస్ ఉగ్రవాద సంస్థ ఈ రోజు ఉదయం నుంచి ఇజ్రాయల్ మీద రాకెట్ లతో బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా నుంచి ఇజ్రాయల్ దిశ‌గా డ‌జ‌న్ల సంఖ్య‌లో రాకెట్ల‌ను ఫైర్ చేశారు. పాల‌స్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హ‌మాస్ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఇరు వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్‌లోకి భారీగా ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ద‌ళాలు పేర్కొన్నాయి. స్థానికులు ఇండ్ల వ‌దిలి బ‌య‌ట‌కు రావొద్దు అని ఇజ్రాయల్ డిఫెన్సు ఫోర్సు (ఐడీఎఫ్) హెచ్చరించింది. అషేక్లాన్ న‌గ‌రంలో చెల‌రేగిన మంట‌ల్ని ఆర్పేందుకు ఇజ్రాయిల్ ఫైర్‌ఫైట‌ర్లు రంగంలోకి దిగారు. కాలిపోయిన వాహ‌నాల నుంచి భారీ స్థాయిలో న‌ల్ల‌టి పొగ చిమ్ముతోంది.

ద‌క్షిణ ప్రాంత న‌గ‌ర‌మైన సీడెర‌ట్‌లో హ‌మాస్ ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. ఇజ్రాయ‌ల్ దేశంలోకి ఎంత మంది ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. ప్ర‌స్తుతం హ‌మాస్‌, ఐడీఎఫ్ మ‌ధ్య భీక‌ర పోరు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల రాకెట్ల‌తో హ‌మాస్ దాడి చేసిన‌ట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఉగ్రదాడులకు ఇజ్రాయల్ సేన దీటుగా జవాబు ఇస్తోంది. జెరుస‌లాం, బీర్‌షీబా, టెల్ అవివ్ తదితర ప్రధాన నగరాల్లో సైరన్ మోగించి యుద్ద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు యుద్దానికి సన్నద్ధం కావాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ఇజ్రాయల్ లోని ప్రధాన విమానాశ్రయాలను మూసివేశారు. కీలక ప్రాంతాలన్నీ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది.

హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి తప్పు చేశారని… వారిని జల్లెడ పట్టి మరీ ఏరివేస్తామని ఇజ్రాయల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ హెచ్చరించారు. హమాస్ దాడులపై మీడియాతో స్పందించిన రక్షణ మంత్రి గంభీర స్వరంతో మాట్లాడటం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.

ఉదయం ఏడు గంటలకే సాయుధులైన హమాస్ ఉగ్రవాదులు వివిధ నగరాలలోకి వచ్చి కాల్పులు జరిపిన దృశ్యాల వీడియోలను మొదటగా ప్రజలు నమ్మలేదు. ఆర్మీ యుద్ద సైరన్ మోగించటంతో అందరు అప్రమత్తమయ్యారు. మరోవైపు హమాస్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

2006 సంవత్సరంలో లెబనాన్ సైన్యం ఒక ఇజ్రాయల్ సైనికున్ని కిడ్నాప్ చేసినందుకు బీరూట్ నగరాన్ని యూదు సైన్యాలు నేలమట్టం చేశాయి. ఇప్పుడు హమాస్ దాడులతో ఇజ్రాయల్ బీకర యుద్దానికి దిగే అవకశాలు ఉన్నాయి. అదే జరిగితే పాలస్తీనా శవాల దిబ్బగా మారుతుంది. హమాస్ ఉగ్రవాదులకు సహకరించిన సంస్థ, వ్యక్తులు ఎవరనేది తేలినా… సప్త సముద్రాలు దాటైనా సరే ఇజ్రాయిల్ గూడచార సంస్థ మోస్సాద్ శత్రువును మట్టుబెడుతుంది.

తాజా ఘర్షణలతో మధ్యదార సముద్ర తీర దేశాలు అప్రమత్తం అయ్యాయి. మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే వారిని నిశితంగా తనిఖీలు చేసి అనుమతిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్