Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహోం మంత్రి చేతి దెబ్బ

హోం మంత్రి చేతి దెబ్బ

Official Slap : ఏదో సినిమాలో “ఏదీ నీ చెంప…నా చేతికి ఒకసారి అనుకూలంగా పెట్టు” అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటూ ఉంటాడు. శిష్యుడు దగ్గరికి రాగానే అతడి చెంప చెళ్లుమనిపిస్తూ ధర్మవరపు నవ్వుతూ ఉంటాడు.

మాకు చిన్నప్పుడు స్కూళ్లల్లో వింత వింత శిక్షలు ఉండేవి. ముక్కు పట్టుకుని చెంపలు వాయించడం, చెవి మెలిపెట్టడం, తొడపాశం, గుంజిళ్ళు, గోడ కుర్చీ, ఒంటి కాలి మీద నిలుచోవడం, స్కేల్ దెబ్బలు, బెత్తం దెబ్బలు, ఎండలో బయట నిలుచోవడం, గ్రౌండ్ చుట్టూ రెండు రౌండ్లు పరుగెత్తడం (రెండు కిలో మీటర్ల దూరం), బ్లాక్ బోర్డులు శుభ్రం చేసి పెట్టడం…ఇలా లెక్కలేనన్ని. క్లాసులో విద్యార్థి తప్పుల తీవ్రతను బట్టి ఇందులో ఒకటి రెండు లేదా కాంబోలో అన్నీ.

ఇప్పటిలా మా పిల్లలను వాతలు తేలేలా ఎందుకు కొట్టారు? అని స్కూలుకొచ్చి అడిగిన తల్లిదండ్రులను అప్పుడు నేను చూడలేదు. పైగా మా వాడిని బాగా కొట్టండి అని తల్లిదండ్రులు ప్రాధేయపడి వెళ్లేవారు. దాంతో ఇది నా దెబ్బ…ఇది మీ నాయన అడిగిన దెబ్బ అని శిక్ష డబుల్ డోస్ అయ్యేది. పిల్లలే చింత చెట్లెక్కి తమను కొట్టడానికి అనువైన చింత కొమ్మలను తెంచి…ఆకులు దూసి…గౌరవంగా బెత్తాలను అయ్యవార్ల చేతిలో పెట్టి…కొట్టండని చేతులు చాచిన…ధర్మం నాలుగు కాళ్లతో నడిచిన సత్తెకాలమది.

నన్ను కొట్టినారు కదా! మా నాయన సర్పంచ్. ఆయన్ను తోడుకొని వస్తా! అని హెచ్చులుపోయాడు ఒకడు. మరుసటిరోజు అసెంబ్లీ కాగానే…మీ నాయన్ను కూడా ఇదే స్కూల్లో కొట్టినా…ఇప్పుడు నీ వంతు అని వాళ్ళ నాన్న ముందు దెబ్బల జ్ఞానం కలిగించారు మా సార్. టీచర్ దెబ్బలకు తోడు తండ్రి దెబ్బలు కూడా తోడయ్యాయి. “టీచర్ కొట్టకపోతే ఇంకెవరు కొడతారు?” అని పంచ సవరించుకుంటూ గొప్ప పంచ్ డైలాగ్ సందేశం ఇచ్చి వెళ్ళాడు ఆ సర్పంచ్.

దండం దశగుణం భవేత్. దేవుడికన్నా దెబ్బే గురువు లాంటి మాటలకు బాగా అంగీకారం ఉండేది అప్పట్లో. ఆ టీచర్లందరూ మాకు దేవుళ్లు. వారు చెప్పిందే చదువు. వారు చూపిందే ప్రపంచం.

ప్రేయసి బుగ్గ మీద ప్రియుడు దెబ్బ వేస్తే…దానికి వేటూరి ఒక పాటనే పుట్టించి ఆ దెబ్బలకు కమ్మదనాలను అద్ది…ఆ బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు పూయించారు. ప్రేయసి చెంపల మీద ప్రియుడు; ప్రియుడి చెంపల మీద ప్రేయసి దెబ్బలు ప్రేమోపహతమయినవి. అలా ఒకరి బుగ్గ మీద ఒకరు చరుచుకుంటూ…వాచిన బుగ్గల్లో బూరెలు వండుకున్న పాటలు తెలుగులో కోకొల్లలు.

సినిమాలో చెంప దెబ్బ ప్రణయకలహం. బయట చెంప దెబ్బ అవమానకరం. భౌతిక దాడి. అమానవీయం. ఆ విషయం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి తెలుసు. కానీ నిగ్రహించుకోలేకపోయారు. తను చేయి చాచగానే టక్కుమని పూలగుత్తి(బొకే) అందివ్వని తన గన్ మ్యాన్ చెంప చెళ్లు మనిపించారు. సామాజిక మాధ్యమాల్లో హోం మంత్రిగారి చేయి దురుసు బాగా వైరల్ అయ్యింది.

లోకంలో ఎవరయినా చేయి చేసుకుంటే హోం మంత్రికి ఫిర్యాదు చేయవచ్చు. హోం మంత్రే చేయి చేసుకుంటే ఎవరికి చెప్పుకోవాలి?

నిజానికి మోహమూద్ అలీ సౌమ్యుడే. పాతబస్తీలో తెల్లవారుజామున హాయిగా గొడ్ల చావిట్లో ఆవులు, దున్నపోతుల మధ్య పాడిపనులతో తన దినచర్యను ప్రారంభించే రకం. ఏదో నిగ్రహం కోల్పోయినట్లున్నారు. ఆ కానిస్టేబుల్ కు క్షమాపణ చెప్పి…పశ్చాత్తాపం ప్రకటించి ఉంటే…హుందాగా ఉండేది.

మా హిందూపురం ఎమ్మెల్యే చేతిలో దెబ్బలు తిన్న మా ఊరి జనం జన్మధన్యమయ్యిందని బహిరంగంగా చెప్పుకుని…మళ్లీ మళ్లీ తమ చెంపలను ఆయన చేతికి వాటంగా అందిస్తున్నారు. అలా ఈ కానిస్టేబుల్ కూడా జన్మ ధన్యమయిందని అనుకుంటూ ఉండి ఉంటే…మనం చేయగలిగింది లేదు.

సరదా ముగింపు:-
చిన్నప్పుడు మాకు క్లాసులో సంధి సూత్రాలు చెప్పేప్పుడు-
“చెంపకు చేయి పరంబగునపుడు కంటికి నీరు ఆదేశమగును” అని ఎగతాళి సూత్రం కూడా చెప్పేవారు. అది ఎగతాళి కాదని…పరమ సీరియస్ వాస్తవిక సూత్రమని తరువాత తెలిసింది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్