రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ఎన్నో అరాచకాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రజాస్వామ్యం అనేది లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తనకు 50సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఇంత దారుణంగా దిగజారిన పోలీసు వ్యవస్థను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. కళ్ళెదుటే అరాచకాలు జరుగుతూ ఉన్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని అంతమొందించేందుకు గతంలో ముఖ్యమంత్రులు కృషి చేశారని, కానీ సిఎం జగన్ అయిన తరువాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం పోలీసులు, సిఎం జగన్ గుర్తుంచుకోవాలని, ప్రజలు తిరగబడిన రోజున ఏ పదవులూ నాయకులకు ఉండవని హెచ్చరించారు. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై జరిగిన దానిని కన్నా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని డిజిపికి విజ్ఞప్తి చేశారు.
ఈనెల 23 మధ్యాహ్నం 2.30 గంటలకు తాను మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, తాను ఎందుకు చేరుతున్నాననే విషయం ఆరోజునే చెబుతానని కన్నా వెల్లడించారు. గతంలో తాను టిడిపి, చంద్రబాబుపై మాట్లాడిన వీడియోలతో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. తాము కూడా గతంలో జగన్ సోనియా గాంధీని పొగిడిన వీడియోలు బైతపెట్టగలమని స్పందించారు.
Also Read : సన్మానాలు ఎందుకో: కన్నా విసుర్లు