Sunday, January 19, 2025
HomeTrending Newsకర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదిరిన వివాదం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదిరిన వివాదం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మంగళవారం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలోని బెలగావిలో నిరసనకారులు దాడులు చేశారు. బస్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. బెలగావిలో కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఉధృతంగా సాగుతున్న ఈ పోరాటం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమన్వయ మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభురాజ్‌ దేశాయ్‌ బెలగావి పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్ ప్రకటించింది. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం శ్రేయస్కరం కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపింది. పోలీసులు క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని పేర్కొంది.

మరాఠీ మాట్లాడే మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చేశారని మహారాష్ట్ర వాదిస్తోంది. 1960లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా ఈ తప్పు జరిగిందని వివరిస్తోంది. ఈ వివాదానికి బెలగావి ప్రాంతం కేంద్ర బిందువుగా ఉంది. అటు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలపై కర్ణాటక ఇటీవల తన వాదనను వినిపించింది. దాంతో ఈ వివాదం రాజుకుంది. సరిహద్దు ప్రాంతాల వివాదం ముదిరింది. ఇరు రాష్ట్రాల్లో కొన్ని సంఘాలు దీనికి ప్రాతనిథ్యం వహిస్తూ ఉద్యమిస్తున్నాయి.

Also Read : 

కర్ణాటక- మహారాష్ట్ర ఊళ్ల పంచాయతీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్