Saturday, November 23, 2024
Homeసినిమాకత్తి యుద్ధం కాంతారావు

కత్తి యుద్ధం కాంతారావు

Katthula Kantha Rao:
అనగనగా ఒక యువరాజు .. ఆయన వీరుడు .. ధీరుడు .. గంభీరుడు. అందంలో మన్మథుడు .. పరాక్రమంలో అర్జునుడు. కండబలం .. గుండెబలం కలిగినవాడు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించే చురకత్తుల వంటి చూపులు కలిగినవాడు. కత్తి దూస్తే ఆయన ముందు నిలబడి కలబడటం కష్టమే. దుర్మార్గులను .. దుష్ట శక్తులను అంతమొందించడంలో ఆరితేరినవాడు. అలాంటి నాయకుడిని గురించి పేదరాశి పెద్దమ్మ  చెబుతూ ఉంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వినేవారు. అలా జనం ఊహల్లో నుంచి పుట్టి .. తెరపైకి వచ్చిన ఆ నాయకుడి పేరే కాంతారావు.

తెలుగు సినిమా టాకీలు తమ రూపురేఖలను మార్చుకుంటూ ముందుకు వెళుతున్న సమయంలో, నాటకానుభవం ఉన్నవారు చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి మద్రాసుకు చేరుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లినవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఎక్కువగా వినిపించిన పేరు కాంతారావు. ఆయన అసలు పేరు తాడేపల్లి ల కాంతారావు. ఇప్పుడు సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ సమీపంలోని ‘గుడిబండ’ గ్రామంలో ఆయన జన్మించారు. శ్రీమంతుల కుటుంబంలోనే పుట్టి పెరిగిన ఆయన, స్నేహితులతో కలిసి నాటకాలు కూడా వేసేవారు.

స్నేహితుల ప్రోత్సాహంతోనే ఆయన మద్రాసుకు చేరుకున్నారు. అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. హెచ్ ఎమ్ రెడ్డి గారి దర్శకత్వం వహిస్తున్న ‘నిర్దోషి’ సినిమాలో ఆయన ఒక చిన్న వేషం సంపాదించగలిగారు. కాంతారావులో కథానాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉండటాన్ని గమించిన హెచ్ ఎమ్ రెడ్డిగారు, తరువాత సినిమా అయిన ‘ప్రతిజ్ఞ’లో  హీరోగా అవకాశం ఇచ్చారు. అలా కాంతారావు తన రెండో సినిమాతోనే హీరో అయ్యారు. ఆ సినిమాతోనే విలన్ గా రాజనాల పరిచయమయ్యారు. ఇక ఆ సినిమా నుంచి కాంతారావు వెనుదిరిగి చూసుకోలేదు. 

ఒక వైపున పౌరాణికాలతో ఎన్టీఆర్ .. రొమాన్స్ తో కూడుకున్న సాంఘికాలతో ఏఎన్నార్ దూసుకుపోతుంటే, తెలివిగా కాంతారావు జానపదాలను ఎంచుకున్నారు. ఆ సమయంలోనే విఠలాచార్య వరుస జానపద సినిమాలను చేయడం కాంతారావుకు కలిసొచ్చింది. జానపదాల్లో కత్తి యుద్ధంలో కాంతారావు ఎంతో నైపుణ్యం చూపించేవారు. అందువలన ఆయనను అంతా ‘కత్తి కాంతారావు’ అని పిలిచేవారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో సమానంగా ఆయన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండేవి. తెలుగు తెర రాజకుమారుడిగా ఆయన ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్నారు.

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కాంతారావుకి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యం కారణంగా ఆయనకి పౌరాణిక .. చారిత్రక చిత్రాలను వారితో కలిసి చేయడానికి ఉపయోగపడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ .. పౌరాణికాల్లో తాను ఇతర పాత్రలు చేసినప్పుడు కృష్ణుడి పాత్రకు కాంతారావును సిఫార్స్ చేసేవారు. అలాగే నారద పాత్రలు .. అర్జునుడి పాత్రలు .. లక్ష్మణుడి పాత్రలు కాంతారావుకి దక్కుతూ వచ్చాయి. ఇటు ఎన్టీఆర్ .. అటు నాగేశ్వరరావు కాంబినేషన్లో కొన్ని సాంఘిక చిత్రాలలోను కాంతారావు మెప్పించారు. ఈ ఇద్దరితోను ఆయన పోటీపడి నటించేవారు.

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత తన పేరు చెప్పుకునేలా కాంతారావు తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ సినిమాల్లో వారి సరసన నాయికలుగా సావిత్రి – జమున .. కృష్ణకుమారి కనిపిస్తే, కాంతారావు జోడీగా రాజశ్రీ – దేవిక ఎక్కువగా మెరిశారు. కేవీ రెడ్డి .. కమలాకర కామేశ్వరరావు .. సి. పుల్లయ్య .. బీఏ  సుబ్బారావు .. బాపు .. విఠలాచార్య దర్శకత్వంలో కాంతారావు ఎక్కువ సినిమాలు చేశారు. అప్పట్లో మద్రాసులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్’లతో సమానంగా కాంతారావు సినిమాల షూటింగులు జరుగుతూ ఉండేవి.

కాంతారావు ఆస్తిపాస్తులను సమకూర్చుకున్నారు. కార్లు .. మేడలు .. ఖరీదైన జీవితం ఆయనకి అందుబాటులోకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని సినిమాలను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఆయన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, సప్తస్వరాలు .. గండరగండడు .. ప్రేమజీవులు .. గుండెలు తీసిన మొనగాడు .. స్వాతి చినుకులు వంటి సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆర్ధికంగా కాంతారావు దెబ్బతిన్నారు. అప్పులు తీర్చడానికి  మేడలు .. కార్లు అన్నీ అమ్మేయవలసి వచ్చింది.

కాసులు లేని వాళ్లను కానివాళ్లుగానే చూడటమనేది లోకరీతి. ధనంతోనే అన్ని బంధాలు ముడిపడి ఉంటాయనే విషయం కాంతారావుకు అర్థమైపోయింది. అయినా చేసేదేమీ లేదు .. టీవీ సీరియల్స్ చేస్తూ ఆయన చాలావరకూ తమ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభిమానం చాటున వాటిని దాచి పెట్టారు. అనారోగ్యం ఆయనకి ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఎన్నో జానపద సినిమాల్లో శత్రువులపై విరుచుకుపడి గెలిచిన కాంతారావు, నిజ జీవితంలో పరిస్థితులకు తలవంచక తప్పలేదు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన కాంతారావు, 400 సినిమాలకి పైగా నటించారు. ‘‘తెలుగు సినిమాకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లయితే, నుదుట తిలకమే కాంతారావు” అని ఒకానొక సందర్భంలో దాసరి నారాయణరావు ప్రశంసించారు. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా కాంతారావు కీర్తి కిరీటంలో ఒదిగిపోయింది. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.

( కాంతారావు జయంతి ప్రత్యేకం)

Also read : ఆకాశమంతటి ఆలాపన

–  పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్