కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైందీ సినిమా.
చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ‘బెదురులంక 2012’లో కార్తికేయ క్యారెక్టర్ పేరు కూడా అదే. ఇప్పుడీ సినిమా ట్రైలర్ సైతం చిరు తనయుడు, రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తికేయకు, చిత్ర బృందానికి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ”కార్తికేయ, నేహా శెట్టిల జంట చాలా బాగుంది. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారి పాత్ర వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంది. సంగీతం కూడా చాలా కొత్తగా వినిపించింది. ‘ఆర్ఎక్స్ 100’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు.
‘బెదురులంక 2012’ ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని దర్శక నిర్మాతలు బెన్నీ, క్లాక్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని చెప్పారు. ప్రేక్షకుల్ని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, గోదావరి నేపథ్యంలో సినిమాలకు ఇదొక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.