Cloud Burst: గోదావరి పరివాహక ప్రాంతంలో కావాలనే క్లౌడ్ బరస్ట్ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇతర దేశాలవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కుట్రలు చేస్తున్నారని, గతంలో జమ్మూ కాశ్మీర్ లోని లధాక్, ఉత్తరాఖండ్ లో కూడా ఇలా చేసినట్లు కొంత సమాచారం ఉందని, ఇప్పుడు గోదావరి ప్రాంతంలో కూడా ఇలాగే చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను, సహాయ పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి వరదల్లో ప్రాణనష్టం లేకుండా చూసిన అధికారులను. ముఖ్యంగా భద్రాచలంలో జిల్లా కలెక్టర్ మంత్రి పువ్వాడ అజయ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన కృషిని అయన అభినందించారు.
కడెం ప్రాజెక్టు వద్ద డిశ్చార్జ్ కెపాసిటీ గరిష్టంగా 3 లక్షల క్యూసెక్కులు ఉంటుందని, కానీ ఈసారి 5 లక్షలు చేరుకుందని, నిజం చెప్పాలంటే మానవ ప్రయత్నం కాదని, దేవుడి దయ వల్లే ఆ ప్రాజెక్టు బతికిందని వ్యాఖ్యానించారు. వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తుంటాయని, ఇలాంటి సందర్భాల్లో మనం ప్రజలను కాపాడుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బూర్గంపాడులో సహాయ శిబిరాలకు 25 వేల మందిని తరలించారని, ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల తక్షణ ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.
భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మిస్తామని అయన హామీ ఇచ్చారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా తొలుత భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.
భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చినందుకు బాధితూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.