జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపి కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. కెసిఆర్ కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామని, అయన పార్టీ పెట్టుకోవచ్చన్నారు. బిజెపి నేత లక్ష్మణ్ ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ పని ఉట్టికి ఎగరనేలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి రాజకీయమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని తయారు చేస్తాడని కెసిఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ళ పాలనలో తెలంగాణకి కెసిఆర్ ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ను దేశం లో ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదని, అయన ఫ్రంట్ లకు, టెంట్ లకు ఆదరణ లేదన్నారు.
దేశంలో ప్రధాని మోడీనీ ప్రజలు అభిమానిస్తున్నరని, దేశాన్ని బిజెపి విచ్ఛిన్నం చేస్తే గల్లీ నుండి ఢిల్లీ వరకు బిజెపి ఎందుకు గెలుస్తుందని లక్ష్మణ్ అన్నారు. కెసిఆర్ విదేశాంగ విధానం ఎంటి.. పార్టీ విది విధానాలు ఎంటి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాల్లో నే ఉండాల్సిన అవసరం లేదని బిజెపి నేత లక్ష్మణ్ తేల్చి చెప్పారు.
Also Read :