టిఆర్ఎస్ పేరులో నుంచి టి పదాన్ని తొలగించి తెలంగాణను కెసిఆర్ అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీ పేరునుంచి తెలంగాణ తొలగించడం తోనే కేసిఆర్ బలం పోయిందన్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న బాబుకు స్వయంగా కెసిఆరే అవకాశం ఇచ్చినట్లయ్యిందని వ్యాఖ్యానించారు. కేసిఆర్ ఏపికి వెళుతున్నాడు కాబట్టి చంద్రబాబు తెలంగాణ కు వచ్చారన్నారు. కేసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో అంతగా ఆదరణ ఉండదని, కానీ బాబుకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇక కేసిఆర్ తో ఆడుకుంటారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బిఆర్ఎస్ వెళితే టిడిపి కూడా వెళుతుందని, బిఆర్ఎస్ తో కేసిఆర్ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
కేసిఆర్ లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉన్నట్లుందన్న జగ్గారెడ్డి తెలంగాణ వాదాన్ని కేసిఆర్ చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసిఆర్ నరికేశారని ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని, కూటములు, పొత్తులపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.