సింగరేణి కార్మికుల కష్టాలు, సంస్థ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి పరిస్ధితి మారాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్‌ది ఒక జిమ్మిక్కు మాత్రమేనని ఆయన ఆరోపించారు. సింగరేణి కార్మికులు రేయింభవళ్ళు కష్టపడి సంపాదిస్తే దాని పేరుతో సిఎం కెసిఆర్ భోగాలు అనుభవిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణలో బొగ్గు గనులు వేలం వేస్తుంటే అందులో పాల్గొని సింగరేణికి వాటిని దక్కేలా చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటంచారు. సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్, అద్వన్నమైన ఆర్ధిక వ్యవస్థ, గనుల్లో భద్రత లోపించిందని ఆరోపించారు. కోల్ ఇండియాలో పనిచేసే కార్మికులకు 930 రూపాయల వేతనం వుంటే.. సింగరేణిలో పనిచేసే వారికి కేవలం 420 మాత్రమే వేతనంగా ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్మిక సంఘాలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎలాంటి వివక్ష చూపలేదని ఆయన అన్నారు.