ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడం హాస్యాస్పదమని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉందన్నారు. ఆంధ్రా ద్రోహి కేసిఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని, దీని ద్వారా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఆంధ్రా ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారని ఆరోపించారు. ఏపీకి తానేదో ఆపద్బాంధవుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తమకు వర్కింగ్ క్యాపిటల్ ముందుగా సమకూర్చే వారికి స్టీల్ సప్లై చేస్తామనే ఒప్పందంతో ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విడుదల చేసిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్నమాట వాస్తవమేనని, దీనిపై తాను ఎన్నోసార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశామని… అప్పుడు కొంత క్యాపిటల్ కూడా సమకూర్చారని జీవీఎల్ వివరించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
7.3మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయకుండా అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తాము కృషిచేస్తున్నామని ఇప్పటికే మూడు సార్లు ప్లాంట్ ఉద్యోగ సంఘాలు, అధికారులతో చర్చలు జరిపామని, కేసిఆర్ లాగా డబ్బాలు కొట్టుకోవడం లేదనిఅన్నారు. ప్లాంట్ అంశం ద్వారా ఆంధ్రాలో అడుగుపెట్టాలని కెసిఆర్ చూస్తున్నారని, ముందుగా గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.