Saturday, November 23, 2024
HomeTrending Newsదేశాన్ని చక్కదిద్దుతా...కెసిఆర్

దేశాన్ని చక్కదిద్దుతా…కెసిఆర్

ఆరునూరైనా స‌రే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివ‌రి ర‌క్తపు బొట్టు ధార‌పోసి అయినా స‌రే, ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతాను, ముందుకు పోతాను అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం దేవుడు నాకిచ్చిన శ‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతానని, స‌క‌ల మేథోసంప‌త్తిని ఉప‌యోగిస్తానని సీఎం అన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును బుధవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్క‌డే ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ దేశంలో దుర్గార్మమైన వ్యవస్థ నడుస్తున్నదని, దీంతో దేశం కూడా దారితప్పి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మ‌త‌క‌ల్లోలాల‌ పేరిట విధ్వంసం సృష్టిస్తూ చిచ్చు పెడుతున్నారని, ఈ దుర్మార్గాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మ‌తాల పేరు మీద చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పరిస్థితులుంటే పరిశ్రమలు రాకుండా, వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉన్నదని సీఎం హెచ్చరించారు.

కుల, మత కల్లోలాల క్యాన్స‌ర్‌ను ఈ దేశం నుంచి త‌రిమికొట్టేందుకు ప్ర‌జ‌ల‌కు చేటు చేసే వారిని ఎక్కడికక్కడ నిల‌దీసి ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగు ప‌డాలంటే.. కేంద్రంలో కూడా ధ‌ర్మంతో ప‌ని చేసే ప్ర‌భుత్వం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ పురోభివృద్ధి కోసం జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. బెంగ‌ళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మ‌న హైద‌రాబాద్ రెండో స్థానంలో ఉంది. హైద‌రాబాద్ నుంచి ల‌క్షా 50 వేల కోట్ల సాఫ్ట్‌ వేర్ ఎగుమ‌తులు జ‌రుగుతున్నాయి. అంత‌ర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్ర‌తి రోజూ 580 వ‌ర‌కు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణ‌లో ఎక్క‌డా పోయినా ఎక‌ర భూమి 20 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంది. మ‌న రైతులు ధ‌నికుల‌య్యే ప‌రిస్థితి ఉంది. అద్భుత‌మైన ప‌రిశ్రమ‌లు వ‌స్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇత‌ర రంగాల్లో ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. భార‌త‌దేశంలో అతి త‌క్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్