రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉన్నది. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలె. అత్యవసర సేవలను, పాస్ లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు” అని అధికారులను ఆదేశించారు.
కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం లాక్ డౌన్ మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందన్నారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ కోరారు. లాక్ డౌన్ సమయం ముగిశాక ఉదయం 10.10 గంటల తర్వాత పాస్ హోల్డర్స్ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలన్నారు.