Saturday, January 18, 2025
HomeTrending Newsప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం - కెసిఆర్

ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం – కెసిఆర్

అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడిన‌ రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదు.. నా మీద ఈసీ నిషేధం విధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడ‌లు వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతా అని అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడితే రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదు. కానీ నా మీద నిషేధం పెట్టింది. 48 గంట‌లు నా ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధిస్తే.. ల‌క్ష‌లాది బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు 96 గంట‌ల పాటు అవిశ్రాంతంగా ప‌ని చేస్తారని కేసీఆర్ తెలిపారు. మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కేసీఆర్ ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ అర‌చేతిలో వైకుంఠం చూపించి, అడ్డ‌గోలు హామీలిచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్న‌ది. రైతుబంధు ఇవ్వ‌లేదు. మ‌హిళ‌ల‌కు రూ. 2500 వ‌చ్చాయా..? తులం బంగారం వ‌చ్చిందా…? ఏది కూడా రాలేదు. కానీ అనేక హామీలు ఇచ్చారు. ఒక్క‌టే ఒక్క హామీ ఉచిత బ‌స్సు నెర‌వేరిస్తే, ఆటో రిక్షా కార్మికులు రోడ్డున ప‌డ్డారు.

కాంగ్రెస్ దుష్ట ప‌రిపాల‌నకు అనేక మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గంలో 15 రోజుల నుంచి వ‌డ్లు కొన‌క‌పోతే తట్టుకోలేక వ‌డ్లు ఆర‌బెడుతూ ఓ రైతు అక్క‌డ‌నే గుండె ఆగిపోయి చ‌నిపోయాడు. కాంగ్రెస్ అర‌చేతిలో వైకుంఠం చూపించి, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మీ త‌ర‌పున ఉన్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్ద‌ని పోరాటం చేస్తున్నానని, నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌కు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌నని కెసిఆర్ అన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిషేధం వ‌ల్ల ఎక్కువ మాట్లాడ‌లేక‌పోతున్నానన్నారు. మాలోత్ క‌విత మ‌చ్చ లేని మ‌నిషి.. గ‌త ఐదేండ్లు ఎంపీగా బ్ర‌హ్మాండంగా ప‌ని చేసిందని, ఈసారి అవ‌కాశం ఇస్తే తెలంగాణ హ‌క్కులు కాపాడేందుకు, నిధులు రాబ‌ట్టేందుకు, తెలంగాణ‌ను ముందుకు తీసుకుపోవ‌డానికి మీ సేవ‌కురాలిగా ప‌ని చేస్త‌దన్నారు. ప్ర‌తి క్ష‌ణం ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌తి క్ష‌ణం ప్ర‌గ‌తి కోసం.. ప్ర‌తి మాట ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం అన్నవిధంగా బీఆర్ఎస్ ప‌ని చేస్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే నాటికి కెసిఆర్ వస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలియని సందిగ్దం గులాబీ నేతల్లో ఉండింది. పరిస్థితులకు అనుగుణంగా విమర్శల శైలి మారుస్తూ వస్తున్న కెసిఆర్ వాగ్భాణాలకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తాజాగా ఈసీ ఆంక్షలతో బీఆర్ఎస్ అధినేత ప్రసంగాలపై ప్రజల్లో చర్చ మొదలైంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్