వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారన్నారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారని, తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో స్పందించారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు రుణం తీరిపోయిందని, తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆరెస్ అన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని, ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదన్నారు.
తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలని, ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెస్ గా మార్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదన్నారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండని ప్రజలను కోరారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : దేశ ప్రజలను గెలిపిస్తాం – కెసిఆర్